'మాస్ జాతర'కు సెన్సార్ క్లియర్.. ఈసారి హిట్టు కొట్టాల్సిందే!
గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు, ఈ సినిమా మంచి కమ్‌బ్యాక్ ఇస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
By: M Prashanth | 25 Oct 2025 4:03 PM ISTమాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'మాస్ జాతర'. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు, ఈ సినిమా మంచి కమ్‌బ్యాక్ ఇస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ, సినిమా నుంచి ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది.
సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో, 'మాస్ జాతర' టీమ్ అన్ని పనులను చకచకా పూర్తి చేస్తోంది. ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే పాటలతో సందడి చేస్తున్న మేకర్స్, ట్రైలర్ రిలీజ్‌కు కూడా డేట్ ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే, సినిమాకు అత్యంత ముఖ్యమైన సెన్సార్ కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, 'మాస్ జాతర' సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ U/A సర్టిఫికెట్‌ను పొందింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమాలో మాస్ యాక్షన్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించే అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
ఈ సర్టిఫికెట్‌తో, సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే. ఇక థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు అసలైన జాతర చూపించడానికి రవితేజ అండ్ టీమ్ రెడీ అయిపోయింది. భాను భోగవరపు ఈ చిత్రాన్ని ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలిచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
'ధమాకా' తర్వాత ఈ జోడీ మళ్లీ రిపీట్ అవుతుండటంతో, వాళ్ల కెమిస్ట్రీ మరోసారి మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, అక్టోబర్ 31న 'మాస్ జాతర' థియేటర్లలోకి రానుంది. ఇక రవితేజ ఎలాంటి ఫలితాన్ని ఆందుకుంటాడో చూడాలి.
