నెక్ట్స్ సంక్రాంతికి కోడిపందాల్లో కలుద్దాం.. 'ఇరుముడి' రాజా జోష్
తాజాగా భీమవరంలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఆ ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ ట్రైలర్.. సినిమాలోని ప్రధాన కథాంశంపై స్పష్టతనిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
By: Sivaji Kontham | 13 Aug 2026 12:01 AM ISTమాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం 'ఇరుముడి'. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పగా.. తాజాగా భీమవరంలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఆ ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ ట్రైలర్.. సినిమాలోని ప్రధాన కథాంశంపై స్పష్టతనిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
దర్శకుడు శివ నిర్వాణ తనదైన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్‌కు సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని మలిచినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా రవితేజ కూతురు.. తన తండ్రి కోపాన్ని చూసి తాను కూడా భయపడుతున్నానని చెప్పే సన్నివేశం ఆ పాత్రలోని ఎమోషనల్ కాంప్లెక్సిటీని చాటిచెబుతోంది. కుటుంబ బంధాలను, భావోద్వేగాలను బలంగా ఎలివేట్ చేయడంలో శివ నిర్వాణ స్టైల్ ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది.
హీరో రవితేజ ప్రతి ఫ్రేమ్‌లోనూ తనదైన మాస్ ఎనర్జీతో అలరించారు. ఒకవైపు కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించే బాధ్యతగల వ్యక్తిగా, మరోవైపు అన్యాయంపై విరుచుకుపడే ఆవేశపరుడిగా ఆయన పాత్రలోని వైవిధ్యం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా మద్యపాన అలవాటు ఉన్న వ్యక్తి... అయ్యప్ప మాల ధరించినప్పుడు పొందే ప్రశాంతత.. ఈ రెండు భిన్నమైన కోణాలను చూపించిన తీరు పాత్రకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
భీమవరంలో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ భీమవరంతో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ''హలో భీమవరం! నాకు భీమవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. నా జీవితంలో దాదాపు ఎనిమిది నెలలు కేవలం సినిమాలు చూడటానికే ఇక్కడే ఉన్నాను. మా తాతయ్య, నానమ్మ డీఎన్‌ఆర్ కాలేజ్ దగ్గర ఉండేవారు. భీమవరం వైబ్, ఇక్కడి ఫుడ్ ఎంతో ప్రత్యేకం. నెక్స్ట్ సంక్రాంతికి కోడిపందాల్లో కలుద్దాం'' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది.
మొత్తానికి `ఇరుముడి` ట్రైలర్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్ అంశాలను సరైన మోతాదులో మేళవించి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. మీతో పాటే తాను కూడా ట్రైలర్ చూశానని.. ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని రవితేజ ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక విభిన్నమైన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుభూతిని అందించబోతోంది.
