పాన్ ఇండియా తరువాత ఇరుముడి.. టాప్ లిస్టులో ఇలా..
ఇరుముడి సినిమా నాలుగో వారంలోకి వచ్చేసింది. నార్మల్ గా ఈ టైమ్‌కు కొత్త సినిమాల హడావుడిలో పాత సినిమా నంబర్లు పెద్దగా కనిపించవు.
By: M Prashanth | 14 Sept 2026 11:17 AM ISTఇరుముడి సినిమా నాలుగో వారంలోకి వచ్చేసింది. నార్మల్ గా ఈ టైమ్‌కు కొత్త సినిమాల హడావుడిలో పాత సినిమా నంబర్లు పెద్దగా కనిపించవు. కానీ రవితేజ సినిమా మాత్రం బుక్‌మైషో టికెట్ సేల్స్‌లో మరో మెట్టు ఎక్కింది. ఇప్పటివరకు దాదాపు 48.1 లక్షల టికెట్లు అమ్ముడవడంతో దేవర, హనుమాన్ లను దాటి తెలుగు సినిమాల లిస్టులో నాలుగో స్థానానికి చేరింది. ప్రస్తుతం దీని ముందు ఉన్న సినిమాలు పుష్ప 2, కల్కి 2898 ఏడీ, సలార్.
ఈ నంబర్‌లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. పై మూడు సినిమాలూ భారీ పాన్ ఇండియా సెటప్‌తో వచ్చినవే. పుష్ప 2కు మొదటి భాగం నుంచి వచ్చిన క్రేజ్ ఉంటే, సలార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్. కల్కి కూడా ప్రభాస్‌తో పాటు అమితాబ్, కమల్ హాసన్ లాంటి పెద్ద క్యాస్టింగ్‌తో వచ్చింది. ఇరుముడి మాత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. తమిళంలో కూడా విడుదలైనా, అసలు బిజినెస్ తెలుగు మార్కెట్ నుంచే వచ్చింది.
బుక్‌మైషోలో ప్రస్తుతం తెలుగు సినిమాల టాప్ 5 లిస్ట్
1. పుష్ప 2: 2.04 కోట్ల టికెట్లు
2. కల్కి 2898 ఏడీ: 1.31 కోట్ల టికెట్లు
3. సలార్: 71.7 లక్షల టికెట్లు
4. ఇరుముడి: 48.1 లక్షల టికెట్లు
5. దేవర: 48 లక్షల టికెట్లు
‘హనుమాన్’ 47.2 లక్షలతో తర్వాతి స్థానంలో ఉంది. బుక్‌మైషో సేల్స్ మాత్రమే ఈ లెక్కలో ఉన్నాయి. మొత్తం థియేట్రికల్ ఫుట్‌ఫాల్స్‌కు ఇవి సమానం కావు. ‘ఇరుముడి’కి ప్రీ సేల్స్‌లో సుమారు 2.34 లక్షల టికెట్లు నమోదవగా, మొదటి వారంలోనే మరో 25.9 లక్షలు అమ్ముడయ్యాయి. రెండో వారంలో 14.3 లక్షలు వచ్చాయి. మూడో వారం పూర్తయ్యేసరికి మొత్తం 47.37 లక్షలకు చేరింది. అక్కడి నుంచి నాలుగో వారంలో కూడా సేల్స్ కొనసాగి ఇప్పుడు ‘దేవర’ను క్రాస్ చేసింది.
రవితేజ కెరీర్ పరంగా చూస్తే ఈ రన్ ఇంకా పెద్దది. కొంతకాలంగా ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చినా, థియేటర్లలో రెండో వారం తర్వాత అదే స్థాయిలో నిలబడటం జరగలేదు. ‘ఇరుముడి’ మాత్రం ఆ ట్రెండ్‌ను మార్చింది. ఆగస్టు 21న విడుదలైన సినిమా మూడు వారాలు పూర్తయ్యాక కూడా రోజువారీ షోలు కొనసాగించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రూ.220 కోట్ల మార్క్‌ను దాటాయి. రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా ఇది నిలిచింది.
ఇప్పుడు బుక్‌మైషో లిస్టులో ‘సలార్’ 71.7 లక్షల దగ్గర ఉండటంతో మూడో స్థానానికి ఇంకా పెద్ద గ్యాప్ ఉంది. ‘ఇరుముడి’ నాలుగో వారంలో ఉండటం వల్ల ఆ నంబర్ వరకు వెళ్లడం అంత ఈజీ కాదు. కానీ 48 లక్షల దగ్గర ఉన్న ‘దేవర’, 47.2 లక్షల ‘హనుమాన్’ను దాటడం మాత్రం రవితేజ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్. ఇక థియేట్రికల్ రన్ పూర్తయ్యే సమయానికి ఈ కౌంట్ ఎక్కడ ఆగుతుందన్నది చూడాలి.
