‘పోకిరి’ తర్వాత నిజమైన ఇండస్ట్రీ హిట్ 'ఇరుముడి'
దానికి కారణాలు కూడా సింపుల్‌గానే ఉన్నాయి. ప్రేక్షకులు తగ్గడం ఒకటైతే, థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు మరో పెద్ద భారం.
By: M Prashanth | 24 Aug 2026 11:26 AM ISTఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖ లాంటి పెద్ద సిటీల కలెక్షన్స్‌తో మాత్రమే లెక్క తేలేది కాదు. బి, సి సెంటర్లలో కూడా సినిమా ఎంత బలంగా నడిచిందన్నది చాలా ముఖ్యం. చిన్న పట్టణాల్లో ఒక్కో సినిమా వారాల తరబడి హౌస్‌ఫుల్స్‌తో నడిచేది. కానీ గత కొన్నేళ్లలో ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. చాలా చోట్ల థియేటర్లు మూతపడ్డాయి. ఉన్నవాటిలో కూడా పెద్ద సినిమా వచ్చినప్పుడే తలుపులు తెరిచే పరిస్థితి వచ్చింది.
దానికి కారణాలు కూడా సింపుల్‌గానే ఉన్నాయి. ప్రేక్షకులు తగ్గడం ఒకటైతే, థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు మరో పెద్ద భారం. కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులు కలిపితే రోజూ షోలు వేసి ఖాళీ సీట్లతో నడపడం యజమానులకు కష్టమైంది. అందుకే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు వారం, పది రోజులు నడిపి మళ్లీ థియేటర్ మూసేసే పరిస్థితి చాలా బి, సి సెంటర్లలో కనిపిస్తోంది.
ఇలాంటి టైమ్‌లో ‘ఇరుముడి’ మాత్రం అలా మాస్ సెంటర్లలో కూడా బాగా పని చేస్తోందని ఎగ్జిబిటర్స్ నుంచి మంచి మాటలు వినిపిస్తున్నాయి. సిటీల్లో బుకింగ్స్ బాగున్నాయనే విషయం ఇప్పటికే కనిపిస్తోంది. కానీ బి, సి సెంటర్స్ అయిన చిన్న పట్టణాల్లో కూడా ఫ్యామిలీస్ వచ్చి సినిమా చూస్తుండటం వాళ్లకు ఇంకా పెద్ద రిలీఫ్. కొన్ని చోట్ల మొదటి రోజు నుంచే పెట్టిన డబ్బు తిరిగి వచ్చేసే స్థాయిలో కలెక్షన్స్ రావడంతో ఎగ్జిబిటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లు చెబుతున్నారు.
అందులోనే కొందరు ఎగ్జిబిటర్స్ ‘పోకిరి’ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. మహేష్ బాబు ‘పోకిరి’ వచ్చినప్పుడు బి, సి సెంటర్లలో కూడా సినిమా చాలా రోజుల పాటు బలంగా నడిచింది. ఒక్కోసారి ఇండస్ట్రీ హిట్ అనేది పెద్ద నంబర్లతో మాత్రమే కాదు.. చిన్న పట్టణాల్లో కూడా థియేటర్‌ను మళ్లీ ఫుల్ చేయగలిగిందా అన్నదానితో తెలుస్తుంది. ఆ లెక్కలో ‘ఇరుముడి’ తమకు చాలా రోజుల తర్వాత అలాంటి ఫీలింగ్ ఇచ్చిందని చెప్పేవాళ్లు ఉన్నారు.
రవితేజకు అసలు బలం కూడా ఈ సెంటర్లే. ఆయన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఉంటే బి, సి ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అవుతారు. కానీ ‘ఇరుముడి’లో మాస్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండటంతో ఈసారి ఒకే వర్గం కాకుండా ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి. అందుకే సినిమా రన్ సిటీల వరకే ఆగిపోకుండా లోపలి ప్రాంతాలకు కూడా వెళ్లింది.
ఇప్పుడు నిజంగా ఇండస్ట్రీకి కావాల్సింది ఇలాంటి సినిమాలే. పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు రెండు రోజులు థియేటర్ నిండటం కాదు.. చిన్న పట్టణాల్లో మూసివేసిన థియేటర్‌కు కూడా మళ్లీ షోలు వేసే ధైర్యం రావాలి. ‘ఇరుముడి’ అక్కడి ఎగ్జిబిటర్స్‌కు అలాంటి ఊపునే ఇచ్చిందంటే, అది కలెక్షన్స్ కంటే కూడా పెద్ద విజయమే అని చెప్పవచ్చు.
