ఇరుముడి.. మనం అనుకునే సినిమా కాదు
మాస్ రాజా రవితేజ.. ఈ మధ్య ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి భిన్నమైన అడుగులు వేస్తున్నాడు. తన నుంచి ఈ ఏడాది ఆరంభంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ మూవీ వచ్చింది.
By: Garuda Media | 11 Aug 2026 11:37 PM ISTమాస్ రాజా రవితేజ.. ఈ మధ్య ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి భిన్నమైన అడుగులు వేస్తున్నాడు. తన నుంచి ఈ ఏడాది ఆరంభంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ మూవీ వచ్చింది. అందులో ఎక్కడా ఒక్క ఫైట్ లేదు. భార్య, ప్రేయసి మధ్య నలిగిపోయే ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో పూర్తి భిన్నంగా కనిపించాడు రవితేజ. కాబట్టే ఈ సినిమా టైటిల్స్‌లో తన పేరు ముందు ‘మాస్ రాజా’ అని కూడా వేసుకోలేదు. ఇప్పుడు రవితేజ నుంచి ‘ఇరుముడి’ అనే మరో భిన్నమైన సినిమా వస్తోంది.
ఈ సినిమా అనౌన్స్ చేసినపుడే అయ్యప్ప మాల నేపథ్యంలో రవితేజ లాంటి మాస్ హీరో సినిమా చేయడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే టైటిల్ చూసి ఇది పూర్తిగా భక్తి సినిమా అనుకోవడానికి కూడా లేదు. ఈ సినిమాలో అనేక జానర్లు మిక్స్ అయి ఉన్నాయని.. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ సినిమా నడుస్తుందని.. తమిళ క్రిటిక్ భరద్వాజ్ రంగన్‌తో చేసిన ఇంటర్వ్యూలో దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జి.వి..ప్రకాష్ కుమార్ కలిసి చెప్పారు.
‘ఇరుముడి’ ఒక ఫ్యామిలీ డ్రామాలా మొదలై.. కొంత వరకు అలాగే నడుస్తుందట. తర్వాత సినిమా వేరే జోన్లోకి వెళ్తుందని.. ఒక దశలో థ్రిల్లర్ సినిమాలా రూపాంతరం చెందుతుందని.. చివరికి బ్యూటిఫుట్ ఎమోషనల్ డ్రామాగా ముగుస్తుందని శివ నిర్వాణ తెలిపాడు. సినిమా ఆద్యంతం తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉంటుందని.. ఇందులో థ్రిల్లర్ టచ్ ఉంటుందని జి.వి.ప్రకాష్ కుమార్ తెలిపాడు. తెలుగు ప్రేక్షకుల వరకు ఇది చాలా భిన్నమైన అనుభూతిని ఇచ్చే సినిమా అని, ఇక్కడ ఇలాంటి సినిమాలు అరుదు అని జి.వి.ప్రకాష్ కుమార్ అభిప్రాయపడ్డాడు.
వీళ్లిద్దరూ చెప్పిన మాటల్ని బట్టి చూస్తే ‘ఇరుముడి’ జస్ట్ భక్తి టచ్ ఉన్న ఫ్యామిలీ మూవీ కాదని.. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయని అర్థమవుతోంది. తమిళం, మలయాళంలో ఇలాంటి సినిమాలు రావడం మామూలే. తెలుగులో దీన్నొక కొత్త ప్రయత్నంగా చూడొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో తమిళ అమ్మాయి ప్రియ భవానీ శంకర్.. రవితేజకు జోడీగా నటించింది. హీరోకు, తన కూతురికి మధ్య బాండింగే ఈ కథలో కీలకమని తెలుస్తోంది. ‘ఇరుముడి’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
