Begin typing your search above and press return to search.

తండ్రి-కూతురు బంధం నుంచి క్రైమ్ మిస్టరీ వరకూ ‘ఇరుముడి’ కాన్సెప్ట్ వైరల్!

ఈ సినిమాలో రవితేజ భార్యాకూతుళ్లను ప్రాణంగా ప్రేమించే ఒక సాధారణ మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు.

By:  Madhu Reddy   |   13 Aug 2026 12:52 PM IST
తండ్రి-కూతురు బంధం నుంచి క్రైమ్ మిస్టరీ వరకూ ‘ఇరుముడి’ కాన్సెప్ట్ వైరల్!
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఇటీవల భీమవరంలో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అంశాలు కలగలిపి రూపుదిద్దుకున్న ఈ సినిమా కాన్సెప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం..

మిడిల్ క్లాస్ ఫాదర్‌గా రవితేజ:

ఈ సినిమాలో రవితేజ భార్యాకూతుళ్లను ప్రాణంగా ప్రేమించే ఒక సాధారణ మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఊరిలోని ప్రతి అమ్మాయిని తన సొంత కూతురిలా భావించే మంచి మనసు ఆయనది. అయితే తాగుడు వ్యసనానికి బానిసైన హీరో, ప్రతి ఏటా 41 రోజుల పాటు అయ్యప్ప మాల ధరిస్తాడు. ఆ దీక్ష సమయంలో పూర్తిగా మద్యానికి దూరంగా ఉంటూ, ప్రశాంతమైన భిన్నమైన మనిషిగా మారతాడు.

కథలో ఊహించని క్రైమ్ ట్విస్ట్:

హీరో జీవితం ఇలా సాగుతుండగా, ఆ ఊర్లో వరుసగా అమ్మాయిల హత్యలు జరగడం కలకలం రేపుతుంది. ఇక అసలు ఆ హత్యలకు కారణం ఎవరు? అయ్యప్ప దీక్షలో ఉన్న హీరో ఈ క్రైమ్ చిక్కుముడిని ఎలా విప్పాడు? హత్యలను ఎలా అడ్డుకున్నాడు అనేదే ఈ సినిమా ముఖ్యమైన కాన్సెప్ట్. ఈ కథనం ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

‘ఇరుముడి’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్:

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు శివ నిర్వాణ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్‌ను బయటపెట్టారు. ఇది కేవలం భక్తి సినిమా కాదని స్పష్టం చేశారు. "ఇరుముడి అంటే ఇద్దరి మధ్య పడిన ముడి. కథలో తండ్రీకూతుళ్ల బంధం ఒక ముడి అయితే, అయ్యప్ప స్వామికి-భక్తుడికి మధ్య ఉండే నమ్మకం రెండో ముడి. అలాగే కథలో వచ్చే క్రైమ్ మిస్టరీ మూడో ముడి. ఈ మూడింటి కలయికే 'ఇరుముడి'" అని క్లారిటీ ఇచ్చారు.

అయ్యప్ప దీక్ష నేపథ్యమే మైలేజ్:

ఇక ఈ సినిమా కథకి శబరిమల ప్రయాణంతో నేరుగా సంబంధం లేదు. కేవలం 41 రోజుల అయ్యప్ప దీక్ష సమయంలో పాటించే కఠినమైన నియమాలు, మాల వేసినప్పుడు వచ్చే మానసిక మార్పులే కథలో ప్రధాన సంఘర్షణకు కారణమవుతాయి. దీక్షకు ముందు ఏం జరిగింది? దీక్షలో ఉన్నప్పుడు ఏం జరిగిందనే అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని డైరెక్టర్ గతం లో ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

ఇక ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఒక భావోద్వేగమైన ఫ్యామిలీ డ్రామాగా మొదలై, నెమ్మదిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారి బ్యూటిఫుల్ ఎమోషన్స్‌తో ముగిసే ఈ 'ఇరుముడి' రవితేజ కెరీర్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలంటే ఆగస్టు 21 వరకు ఆగాల్సిందే..