Begin typing your search above and press return to search.

ఆ నాలుగు సినిమాలతో 'ఇరుముడి' జోరుకు బ్రేక్‌ పడేనా?

అందులో కొన్ని డైరెక్ట్‌ తెలుగు సినిమాలు కాగా, కొన్ని డబ్బింగ్‌ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలతో ఇరుముడి సినిమా జోరు తగ్గుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

By:  Ramesh Palla   |   1 Sept 2026 11:00 AM IST
ఆ నాలుగు సినిమాలతో ఇరుముడి జోరుకు బ్రేక్‌ పడేనా?
X

రవితేజ, శివ నిర్వానల 'ఇరుముడి' సినిమా రెండో వారంలోనూ భారీ వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. రెండో ఆదివారం సైతం ఇరుముడి సినిమా హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్‌ను దక్కించుకోవడంతో పలు రికార్డ్‌లు బ్రేక్ అయ్యాయి. రికార్డ్‌ స్థాయి టికెట్లు బుక్‌ అయిన విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో రెండో వారంలో ఈ స్థాయి వసూళ్లు నమోదు కావడం చూడలేదు అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు, ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్‌ చేస్తున్నారు. ఇరుముడి సినిమా జోరు మూడో వారంలోనూ కొనసాగే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలు ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో కొన్ని డైరెక్ట్‌ తెలుగు సినిమాలు కాగా, కొన్ని డబ్బింగ్‌ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలతో ఇరుముడి సినిమా జోరు తగ్గుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

సందీప్‌ రెడ్డి వంగ నిర్మాణంలో రోమాంచకమ్‌...

అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ వంటి సెన్షేషనల్‌ మూవీస్‌ను తెరక్కించి దర్శకుడిగా పాన్‌ ఇండియా రేంజ్ గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈయన హోం బ్యానర్‌లో నిర్మాణం జరిగిన 'రోమాంచకమ్‌' మూవీ ఈవారం విడుదల కాబోతుంది. సుమంత్ ప్రభాస్‌ హీరోగా వేణు గోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. ఇటీవల విజయ్‌ దేవరకొండ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొని సినిమాపై అంచనాలు మరింత పెంచాడు. విభిన్నమైన ప్రేమ కథతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. తప్పకుండా రోమాంచకమ్‌ మూవీ యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కనుక ఇరుముడి జోరును రోమాంచకమ్‌ అడ్డుకుంటుందని కొందరు బలంగా నమ్ముతున్నారు.

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక మూవీ...

అల్లరి నరేష్ హీరోగా రూపొందిన 'రంభ ఊర్వశి మేనక' సినిమా ఈ వారంలోనే విడుదల కాబోతోంది. సినిమా ట్రైలర్‌, టీజర్‌, పోస్టర్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. అల్లరి నరేష్‌ ను చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కామెడీ మూవీలో చూడబోతున్నామని, వింటేజ్ అల్లరి నరేష్‌ ను చూస్తామని ట్రైలర్‌ ను చూస్తే అనిపిస్తోంది. ఇప్పటికే ఆయన అభిమానులు, కామెడీ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు. కనుక ఇరుముడికి అల్లరోడు కాస్త అయినా బ్రేక్ వేస్తాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక చిన్న సినిమాగా రూపొందిన 'సహ' గురించి సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ కావడంతో బాక్సాఫీస్ వద్ద మినిమం సందడి చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మంచి కంటెంట్‌ మూవీ కనుక ఇరుముడికి సహ మూవీతో కొంత అయినా బ్రేక్‌ పడే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.

రవితేజ ఇరుముడి సినిమా వసూళ్లు...

ఈ మూడు సినిమాలు కాకుండా మమిత బైజు ముఖ్య పాత్రలో నటించిన మలయాళ మూవీ 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' ని తెలుగులో డబ్‌ చేసి ఈ వారం విడుదల చేస్తున్నారు. కేరళలో ఏకంగా రూ.100 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడం ఖాయం అంటున్నారు. కనుక ఈ సినిమా కూడా ఇరుముడి సినిమా మూడో వారం జోరును అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు కాకుండా మీర్జాపూర్‌ ది మూవీ పైనా ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఐమ్‌ గేమ్‌ అనే డబ్బింగ్‌ సినిమా కూడా ఈ వారం విడుదల కాబోతుంది. ఇన్ని సినిమాల మధ్య ఇరుముడి ఇంకా ఆడితే కచ్చితంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో సినిమాలు వస్తున్న కారణంగా ఇరుముడి సినిమా థియేటర్లు, స్క్రీన్స్ సంఖ్య 75% తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. కనుక వసూళ్లు సైతం డ్రాప్‌ కావచ్చు. దాదాపుగా రూ.200 కోట్ల వసూళ్ల మార్క్‌ ను చేరుకున్న రవితేజ ఇరుముడి సినిమా ఈ పోటీలో ఎంత వరకు నిలుస్తుంది అనేది మరో మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ వచ్చేను.