45 కోట్ల గీత.. ఇరుముడి దాటగలదా?
అయితే ఓపెనింగ్ ఎంత బాగున్నా చివరకు సినిమా సేఫ్ అవ్వాలంటే బాక్సాఫీస్ దగ్గర ఒక లెక్క దాటాల్సిందే.
By: M Prashanth | 20 Aug 2026 4:16 PM ISTరవితేజ ‘ఇరుముడి’కి రిలీజ్ ముందు మంచి బజ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ మధ్య ఆయన సినిమాలతో పోలిస్తే బెటర్‌గా ఉన్నాయి. అయితే ఓపెనింగ్ ఎంత బాగున్నా చివరకు సినిమా సేఫ్ అవ్వాలంటే బాక్సాఫీస్ దగ్గర ఒక లెక్క దాటాల్సిందే. ప్రస్తుతం ట్రేడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘ఇరుముడి’ దాదాపు రూ.45 కోట్ల గ్రాస్ చేస్తే బ్రేక్ ఈవెన్‌కు చేరే అవకాశం ఉంది.
రవితేజకు గత కొన్నేళ్లుగా అసలు ఇబ్బంది ఇక్కడే వచ్చింది. సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి కానీ బయ్యర్లకు కావాల్సిన రికవరీ మాత్రం చాలా వాటికి రాలేదు. ‘ఈగల్’ మాత్రమే కొంత వరకు దగ్గరకు వెళ్లింది. మిగతా సినిమాల్లో బిజినెస్‌కు, చివరికి వచ్చిన షేర్‌కు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది. అందుకే ‘ఇరుముడి’కి ఇప్పుడు హిట్ అనే మాట కంటే ముందుగా బయ్యర్లు సేఫ్ అవుతారా అన్నదే చూడాలి.
మరోవైపు ఈసారి పరిస్థితి కొంచెం బెటర్‌గా కనిపిస్తోంది. పాటలు, ట్రైలర్‌కు రెస్పాన్స్ రావడం, అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా కదలడం కలిసి మొదటి రోజు మంచి నంబర్ వచ్చే ఛాన్స్ చూపిస్తున్నాయి. రవితేజ సినిమాకు చాలా రోజుల తర్వాత రిలీజ్ ముందే ఇంత హీట్ కనిపిస్తోంది. కానీ గత సినిమాల లెక్క ఒకసారి చూస్తే ‘ఇరుముడి’ ఎందుకు ముఖ్యమో ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది.
అంచనాల ప్రకారం రవితేజ గత సినిమాల ట్రేడ్ లెక్కలు..
భర్త మహాశయులకు విజ్ఞప్తి: బిజినెస్ రూ.20 కోట్లు.. ఫైనల్ షేర్ రూ.12 కోట్లు
మాస్ జాతర: బిజినెస్ రూ.20 కోట్లు.. ఫైనల్ షేర్ రూ.12 కోట్లు
మిస్టర్ బచ్చన్: బిజినెస్ రూ.32 కోట్లు.. ఫైనల్ షేర్ రూ.8 కోట్లు
ఈగల్: బిజినెస్ రూ.22 కోట్లు.. ఫైనల్ షేర్ రూ.17 కోట్లు
టైగర్ నాగేశ్వరరావు: బిజినెస్ రూ.38 కోట్లు.. ఫైనల్ షేర్ రూ.26 కోట్లు
రావణాసుర: బిజినెస్ రూ.23 కోట్లు.. ఫైనల్ షేర్ రూ.12 కోట్లు
రవితేజ మార్కెట్ ను గమనిస్తే.. ఈమధ్య ప్రతీ సినిమాకు బిజినెస్ జరుగుతూనే ఉంది. కానీ ఆ రేట్లకు తగ్గ రికవరీ రావడం లేదు. ‘ఇరుముడి’కి కూడా మొదటి వీకెండ్ బాగా రావడం ఒక్కటే సరిపోదు. మండే నుంచి హోల్డ్ ఉంటేనే రూ.45 కోట్ల గ్రాస్ లైన్ ఈజీ అవుతుంది. టాక్ బాగుంటే మాత్రం ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ సినిమాకు మంచి స్టార్ట్ ఇవ్వొచ్చు. రవితేజకు ఇప్పుడు కావాల్సింది కూడా అదే. చివరి వరకు నిలబడే ఒక హిట్. గత ఆరు సినిమాల లెక్కను ఒకేసారి మార్చాలంటే ‘ఇరుముడి’కి మొదటి రోజు నుంచి వీకెండ్ వరకే కాదు, ఆ తర్వాత కూడా ప్రేక్షకులు రావాలి.
