Begin typing your search above and press return to search.

చెన్నై క‌ష్టాలు మాస్ రాజా మ‌దిలో ఇంకా ప‌దిలంగానే!

రవితేజ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ముందు చాలా మంది నటులు లాగే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   23 Aug 2026 2:00 PM IST
చెన్నై క‌ష్టాలు మాస్ రాజా మ‌దిలో ఇంకా ప‌దిలంగానే!
X

చెన్నైతో తెలుగు న‌టులది వీడ‌దీయ‌రాని అనుబంధం. నేడు స్టార్ హీరోల‌గా వెలిగిపోతున్న ఎంతో మంది న‌టుల కెరీర్ చెన్నైలోనే ప్రారంభ‌మైంది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్లుగా....క్యార‌క్ట‌ర్ ఆర్టిస్టుల‌గా ఎంతో మంది ప్ర‌యాణం చెన్నైతో ముడిప‌డి ఉంది. అందులో మాస్ రాజా ర‌వితే కూడా ఒక‌రు. ఇటీవ‌లే ర‌వితేజ న‌టించిన `ఇరుముడి` రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించింది. చాలా కాలం త‌ర్వాత రాజాకు స‌రైన హిట్ ప‌డింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో విజ‌యోత్స‌వ వేడుక నిర్వ‌హించింది. ఈ నేప‌థ్యంలో ర‌వితేజ సినీ జీవితం ఆరంభమైన చెన్నై జ్ఞాపకాలను, ఆ నగరంతో ఉన్న విడదీయరాని బంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

`నా సినిమా పరిశ్రమ ప్రయాణం 90వ దశకం మధ్యలో చెన్నైలోనే ప్రారంభమైంది` అంటూ రవితేజ భావోద్వేగానికి లోనయ్యారు. తొలినాళ్ల రోజుల్లో తాను పడ్డ కష్టాలు, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు తన మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని తెలిపారు. ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నేడు అగ్ర హీరో స్థాయికి ఎదిగిన ర‌వితేజ‌ ప్రయాణం అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఒక్క‌సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..

రవితేజ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ముందు చాలా మంది నటులు లాగే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయన కెరీర్ ప్రారంభం చెన్నై కేంద్రంగానే సాగింది. చదువు పూర్తి చేసుకున్న తర్వాత సినిమాలపై ఆసక్తితో రవితేజ చెన్నైకి పయణమయ్యారు. చెన్నైకి వెళ్లిన కొత్తలో రవితేజకు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడంతో అవకాశాలు అంత సులభంగా రాలేదు. కెరీర్ ఆరంభంలో నటుడిగా మాత్రమే కాకుండా, దర్శకత్వ శాఖపై కూడా ఆసక్తి చూపారు.

ఈ క్రమంలోనే పలువురు ప్రముఖ దర్శకులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కృష్ణవంశీతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ..వారి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేయడం ర‌వితేజ‌కు సినిమా మేకింగ్ పై పూర్తి అవగాహన కల్పించింది. తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు, సహాయ పాత్రలు చేస్తూ పరిశ్రమలో ఉనికిని చాటుకునేందుకు రవితేజ ఎంతో శ్రమించారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా సంపాదించిన అనుభవం నటుడిగా కెమెరా ముందు ఎలా ప్రవర్తించాలో? షాట్ కంపోజిషన్స్ ఎలా ఉంటాయో నేర్పింది. ఈ క్రమశిక్షణే అటుపై ర‌వితేజ‌ను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాస్ హీరోగా నిలబెట్టడానికి గట్టి పునాది వేసింది. ఆ త‌ర్వాత ర‌వితేజ కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. మ‌ధ్య‌లో కొన్ని ప‌రాజ‌యాలు ఎదురైనా? ర‌వితేజ స్టార్ డ‌మ్ ముందు అవెక్క‌డా నిల‌బ‌డ‌లేదు. ఆకాశ‌మే హ‌ద్దుగా మాస్ రాజా కెరీర్ దిగ్విజ‌యంగా సాగిపోతుంది.