మాస్ మహారాజా... మూడు నెలలు నిండకుండానే..!
2026 సంక్రాంతికి వస్తామని గతంలోనే ప్రకటించినప్పటికీ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. మాస్ జాతర సినిమాను 2025 సంక్రాంతికి అన్నారు.
By: Ramesh Palla | 22 Oct 2025 1:08 PM ISTమాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన 'మాస్ జాతర' సినిమా విడుదలకు సిద్ధం అయింది. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మాస్ జాతర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఇప్పటికే రికార్డ్ చేసి పెట్టిన ఇంటర్వ్యూలో ఒక్కటి ఒక్కటి చొప్పున విడుదల చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన మాస్ జాతర సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషన్ స్టఫ్ చూస్తే సినిమా ఖచ్చితంగా మంచి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం సినిమా చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో రవితేజ తదుపరి సినిమాపై ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
రవితేజ 75వ సినిమా మాస్ జాతర
రవితేజ 75వ సినిమాగా మాస్ జాతర సినిమా రూపొందింది. అంతా మనదే అనేది ట్యాగ్ లైన్. ఆ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న సినిమా ఇప్పటికే ప్రారంభం అయింది. రవితేజతో మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను కిషోర్ తిరుమల తీస్తున్నాడు. రవితేజ 76వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా టైటిల్‌ను ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సినిమా గురించి రకరకాలుగా టైటిల్స్ ప్రచారం జరుగుతున్నాయి. మొత్తానికి రవితేజ 76వ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతున్నట్లు మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. సినిమా యొక్క షూటింగ్ కు సంబంధించిన విషయాలను హీరోయిన్ ఆషిక రంగనాథ్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అందరికీ క్లారిటీ వచ్చింది.
2026 సంక్రాంతికి రవితేజ కొత్త సినిమా
2026 సంక్రాంతికి వస్తామని గతంలోనే ప్రకటించినప్పటికీ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. మాస్ జాతర సినిమాను 2025 సంక్రాంతికి అన్నారు. కానీ సాధ్యం కాలేదు, ఇప్పుడు అలాగే రవితేజ, కిషోర్ తిరుమల సినిమా విడుదల తేదీ కూడా మారుతుందని, సంక్రాంతికి ఉన్న కాంపిటీషన్ కారణంగా సినిమాను వాయిదా వేయడం ఉత్తమం అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం సినిమాను సంక్రాంతి 2026 కి విడుదల చేయాలని బలంగా ఫిక్స్ అయ్యారు. మరో సారి సినిమా విడుదల సంక్రాంతికి అన్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి చేస్తే మరో కీలక షెడ్యూల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అధికారిక వివరాలు మరిన్ని త్వరలో వచ్చే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పాటు రవితేజ సినిమా
అక్టోబర్ 31న మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ కనీసం మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంత తక్కువ సమయంలో స్టార్ హీరోల సినిమాలు రావడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. రవితేజ మాస్ జాతర చాలా ఆలస్యం అవుతూ వచ్చింది. అందుకే తదుపరి సినిమా విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోవాలని భావించడం లేదని, అందుకే సంక్రాంతి 2026 కి పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ అదే సమయంలో రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ సంక్రాంతికి వస్తే చిరంజీవితో పాటు మరో రెండు సినిమాలతోనూ పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోటీ ఎంత ఉన్నా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా బయట పడే అవకాశం ఉంటుంది. అందుకే రవితేజ ఆ నమ్మకంతో సంక్రాంతికి రావాలని భావిస్తూ ఉంటాడని తెలుస్తోంది.
