మకుటం లేని మహారాజు చిరంజీవి గారి ఆశీస్సులున్నాయి.. మైత్రి నిర్మాతలు ఎమోషనల్
కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం `చెన్నై లవ్ స్టోరీ` చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది.
By: Sivaji Kontham | 23 July 2026 9:24 AM ISTకిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం `చెన్నై లవ్ స్టోరీ` చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై యంగ్ టీమ్ ని ఆశీర్వదించారు. సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇదే వేదికపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేని హాజరై చిత్ర బృందానికి తమ మద్దతును, శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలో తిరుగులేని మహారాజుగా కొనసాగుతూ.. దేశంలో ఏ హీరో ఇవ్వనన్ని ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్‌బస్టర్లు అందించిన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వేడుకకు విచ్చేసి ఈ టీమ్‌ను ఆశీర్వధించడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
సినిమా నిర్మాతల గురించి ప్రస్తావిస్తూ రవిశంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. `బేబీ` చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న నిర్మాతలు సాయి రాజేష్, ఎస్.కే.ఎన్, ధీరజ్ ముగ్గురూ కలిసి ఇప్పుడు `చెన్నై లవ్ స్టోరీ` చిత్రంతో దాన్ని మించిన విజయం సాధించబోతున్నారనే నమ్మకం అందరిలోనూ నెలకొందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలు చాలా వేగంగా ఫుల్ అవుతున్నాయని తెలిపారు. నైజాంలో వేసిన 37 షోలు.. ఇతర ప్రాంతాల్లో వేసిన ప్రీమియర్లు హౌస్‌ఫుల్ కావడం ద్వారా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారిపై రవిశంకర్ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఆ రోజుల్లోనే ఆయన అందించిన చూడాలని ఉంది, ఇంద్రా, పోకిరి, అతడు, చిరుత వంటి ఇండస్ట్రీ హిట్ ఆల్బమ్స్‌కు అప్పట్లో యూట్యూబ్, వ్యూస్ వంటి కొలమానాలు ఉండి ఉంటే 100 బిలియన్లకు పైగా వ్యూస్ వచ్చి ఉండేవి అని కొనియాడారు. అలాగే ఈ సినిమా దర్శకుడు రవి నంబూరి గురించి చెబుతూ.. తొలిచిత్ర దర్శకుడిగా రవి నంబూరి నిజంగా ఒక తోపు అని.. సినిమాను అందరూ మెచ్చుకునేలా చాలా అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు.
ఈ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గానూ సపోర్ట్ అందిస్తున్న మైత్రీ ప్రొడ్యూసర్స్ తరఫున రవిశంకర్ మాట్లాడుతూ.. `చెన్నై లవ్ స్టోరీ` చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని కచ్చితంగా `మెగా బ్లాక్‌బస్టర్` అందుకుంటుందనే పూర్తి ధీమాను, కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులతో సహా చిత్ర బృందానికి ఆయన హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
మరో నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. చెన్నై లవ్ స్టోరీ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి వేడుకకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చిన మెగాస్టార్ చిరంజీవి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమా గ్లింప్స్ చూసినప్పటి నుంచే ఇది తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే బలమైన నమ్మకం తమకు కలిగిందని చెప్పారు. యువ బృందం ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ మూవీ టీమ్ అందరికీ నవీన్ యెర్నేని ఆల్ ది బెస్ట్ చెప్పారు.
