కోర్టు వివాదం ఎలా ఉన్నా రవి మోహన్ సన్నివేశం ఇలా!
ఈ పరిణామాలు ఇలా ఉంటే.. తాజాగా భరణానికి సంబంధించిన వివాదంలో ఒక కీలక అప్‌డేట్ వచ్చింది.
By: Sivaji Kontham | 11 Jun 2026 1:56 PM ISTప్రముఖ నటుడు రవి మోహన్ తన భార్య ఆర్తీతో విడాకుల పోరాటంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతున్న తరుణంలో ఇటీవల జరిగిన ఒక బహిరంగ మీడియా సమావేశంలో రవి మోహన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కనీసం తన సొంత పిల్లలను కూడా చూడటానికి తన భార్య అంగీకరించడం లేదని, తనపై దౌర్జన్యం చేస్తున్నారని అతడు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రముఖ సింగర్ కెనీషా తనకు దూరం కావడానికి కొన్ని మీడియా సంస్థలు చూపించిన అత్యుత్సాహమే కారణమని ఆయన ఆరోపించారు. మీడియా ముందు రవి మోహన్ దాదాపు కన్నీటి పర్యంతం అయిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ పరిణామాలు ఇలా ఉంటే.. తాజాగా భరణానికి సంబంధించిన వివాదంలో ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. రవి మోహన్ నుండి భరణం కోరుతూ ఆయన భార్య ఆర్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును ఎంతమాత్రం వాయిదా వేయకుండా వీలైనంత త్వరగా తేల్చాలని దిగువ ఫ్యామిలీ కోర్టుకు హైకోర్టు న్యాయమూర్తులు స్పష్టమైన సూచనలు చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరో రెండు మూడు వారాల్లో రవి మోహన్ తన భార్య, పిల్లలకు ఎంత భరణం చెల్లించాలనే విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని నెట్టింట కథనాలు వస్తున్నాయి. ఇక ఆస్తులు ఉన్న భార్యకు రవిమోహన్ భరణం చెల్లించాలా? అంటూ సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ మొదలైంది.
ఇలాంటి ఉత్కంఠభరితమైన సమయంలో సోషల్ మీడియా వేదికగా రవి మోహన్ వ్యక్తిగత జీవితంపై సరికొత్త గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ కెనీషాతో మళ్లీ కలిసిపోయారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు వారిద్దరూ కలిసి ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని పాత వీడియోలను ఇప్పుడు సరికొత్తగా వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఆ వీడియోలు ఇప్పటివి కావని.. గతంలో చిత్రీకరించిన పాత వీడియోలని కొందరు నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.
గతంలో రవి మోహన్‌తో ఉన్న అఫైర్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగడంతో కెనీషా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ దుష్ప్రచారం కారణంగానే తాను రవి మోహన్‌తో ఉన్న స్నేహాన్ని కూడా వదులుకుంటున్నానని ఆమె గతంలో ఎంతో ఆవేదనతో ప్రకటించారు. కేవలం పుకార్ల వల్లే ఒక మంచి స్నేహబంధం అర్థాంతరంగా ముగిసిపోయిందనే బాధ రవి మోహన్ మాటల్లో కూడా ఇటీవల స్పష్టంగా కనిపించింది.
ప్రస్తుతం రవి మోహన్ జీవితంలో కోర్టు కేసులు, విడాకుల వివాదాలు, భరణం చెల్లింపులు.. సోషల్ మీడియా పుకార్లతో తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. చుట్టూ ఇన్ని టెన్షన్లు, మానసిక ఆందోళనలు ఉన్నా.. ఆయన వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి రవి మోహన్ ప్రస్తుతం పూర్తిగా తన సినిమా ప్రాజెక్టులపైనా.. షూటింగులపైనే తన దృష్టిని కేంద్రీకరించేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం.
