జాతీయ అవార్డులిస్తే టీవీ రంగానికి ఊపొస్తుందా?
నటుడు, గోరఖ్‌పూర్ ఎంపీ అయిన రవి కిషన్ తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డుల గురించి చేసిన ఓ కామెంట్ హాట్ టాపిగ్గా మారింది.
By: Sivaji Kontham | 24 Jan 2026 4:00 AM IST`రేసు గుర్రం` చిత్రంలో మద్దాల శివారెడ్డిగా రవికిషన్ అద్భుత నటనతో అలరించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్-రవికిషన్ ఒకరితో ఒకరు పోటీపడుతూ నటించడంతో ఈ సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మారింది. రవికిషన్ బహుభాషా నటుడు. రాజకీయ నాయకుడిగాను సుపరిచితుడు.
నటుడు, గోరఖ్‌పూర్ ఎంపీ అయిన రవి కిషన్ తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డుల గురించి చేసిన ఓ కామెంట్ హాట్ టాపిగ్గా మారింది. కేవలం పెద్ద తెరకు మాత్రమే కాకుండా, టెలివిజన్ రంగానికి కూడా జాతీయ చలనచిత్ర అవార్డుల తరహాలోనే గుర్తింపు ఉండాలని రవికిషన్ చేసిన ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
టీవీ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు జాతీయ స్థాయి అవార్డులు ఇవ్వడం వల్ల కంటెంట్ నాణ్యత, నటనలో మెరుగుదల కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో టీవీ రంగానికి భారీ ఆదరణ ఉందని, కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ సీరియల్స్, షోలు చూస్తారని.. కానీ ఆ రంగంలో కష్టపడేవారికి సరైన గౌరవం దక్కడం లేదని ఆయన వాదించారు. సినిమా రంగంలాగే టెలివిజన్ రంగం కూడా ఆర్థిక వ్యవస్థకు.. ఉపాధి కల్పనకు ఎంతో దోహదపడుతోందని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని ఆయన కోరారు.
ప్రస్తుతం భారతదేశంలో టీవీ రంగానికి సంబంధించి రకరకాల ప్రైవేట్ అవార్డులు (ఐటిఏ అవార్డులు, గోల్డ్ అవార్డ్స్ వంటివి...) ఉన్నాయి, కానీ ప్రభుత్వం తరపున అధికారికంగా `జాతీయ అవార్డులు` లేవు. రవి కిషన్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈ విషయాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావించే అవకాశం ఉంది.
రవికిషన్ ప్రతిపాదనను చాలా మంది టీవీ నటీనటులు స్వాగతించారు. కేవలం సినిమాలకే కాకుండా తమకు కూడా జాతీయ గుర్తింపు లభిస్తే అది గర్వకారణమని వారు భావిస్తున్నారు. ఓవైపు ప్రతిపాదనలు ఇలా ఉంటే, మరోవైపు ప్రస్తుత టీవీ సీరియల్స్‌లో కంటెంట్ (ముఖ్యంగా సాస్-బహు డ్రామాలు) చాలా తక్కువ స్థాయిలో ఉందని, అటువంటి వాటికి జాతీయ అవార్డులు ఇవ్వడం భావ్యం కాదని కొందరు విమర్శిస్తున్నారు. అయితే టీవీ సీరియళ్ల నాణ్యత అవార్డులతో పెరగదు. బడ్జెట్లతో పెరుగుతుంది. మంచి కథ కమామీషు కుదిరితే అన్నీ సెట్టవుతాయి.
రాష్ట్ర అవార్డులతో కొంత ఊరట:
టీవీ రంగానికి జాతీయ అవార్డులు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చి గౌరవించడం కొంతలో కొంత ఊరట. జాతీయ స్థాయిలో టీవీ రంగానికి ప్రత్యేక గుర్తింపు లేకపోయినా, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నంది అవార్డులు, గద్దర్ అవార్డులతో టీవీ నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రభుత్వాలు గౌరవించే సంప్రదాయం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి) సినిమాలతో పాటు టెలివిజన్ రంగానికి కూడా నంది అవార్డులను అందజేస్తోంది. ఉత్తమ డైలీ సీరియల్, మెగా సీరియల్, ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, విలన్, హాస్యనటుడు ఇలా సినిమాలకు ఇచ్చే అన్ని కేటగిరీలలోనూ టీవీ రంగానికి అవార్డులు ఇస్తారు. దూరదర్శన్‌తో పాటు ప్రైవేట్ ఛానళ్లలో ప్రసారమయ్యే సీరియల్స్ , ప్రోగ్రామ్‌లను కూడా ఈ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
కేరళ ప్రభుత్వం `కేరళ స్టేట్ టెలివిజన్ అవార్డ్స్` పేరుతో ఏటా ఘనంగా పురస్కారాలు అందజేస్తుంది. ఇది అక్కడి టీవీ రంగానికి అత్యున్నత గుర్తింపు. కర్ణాటక ప్రభుత్వం కూడా రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటు టెలివిజన్ రంగానికి ప్రత్యేక అవార్డులను ఇస్తోంది.
