Begin typing your search above and press return to search.

భోపాల్‌ ఈవెంట్: చ‌ర‌ణ్ స్టార్‌డ‌మ్‌ని ఆకాశానికెత్తేసిన న‌టుడు ర‌వికిష‌న్

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కిన‌ హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా `పెద్ది` ప్రమోషన్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   24 May 2026 12:09 AM IST
భోపాల్‌ ఈవెంట్: చ‌ర‌ణ్ స్టార్‌డ‌మ్‌ని ఆకాశానికెత్తేసిన న‌టుడు ర‌వికిష‌న్
X

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కిన‌ హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా `పెద్ది` ప్రమోషన్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ వేదికగా నిర్వహించిన `పెద్ది కి ఆవాజ్` ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాది మంది నార్త్ ఆడియన్స్, మెగా అభిమానులతో కిక్కిరిసిపోయిన ఈ వేదికపై ప్రముఖ నటుడు, ఎంపీ రవికిషన్ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వ్యక్తిత్వంపైనా.. అలాగే ఈ సినిమా కంటెంట్‌పైనా ఆయన కురిపించిన ప్రశంసల జల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రవికిషన్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ కేవలం టాలీవుడ్ లేదా సౌత్ స్టార్ మాత్రమే కాదని.. అత‌డు ఒక గ్లోబల్ ఐకాన్ అని కొనియాడారు. `ఆర్ఆర్ఆర్` సినిమా తర్వాత రామ్ చరణ్‌కు ఉత్తరాది బెల్ట్‌లో.. ముఖ్యంగా హిందీ ఆడియన్స్‌లో లభిస్తున్న ఆదరణ అసాధారణమైనదని పేర్కొన్నారు. భోపాల్ నగరంలో చరణ్‌ను చూడటానికి తరలివచ్చిన ఈ జనసందోహాన్ని చూస్తుంటేనే ఆయన పాన్-ఇండియా స్టార్‌డమ్ ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోందని ఎమోషనల్ అయ్యారు. చరణ్ లాంటి అగ్ర నటుడితో కలిసి పని చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు రవికిషన్ వెల్లడించారు.

ఇక సినిమా విషయానికొస్తే.. `పెద్ది` చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రవికిషన్ ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు బుచ్చిబాబు సన రాసుకున్న కథ, స్క్రీన్‌ప్లే ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటాయని... ముఖ్యంగా ఇందులో వచ్చే ఎమోషన‌ల్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తాయని చెప్పారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కనబరిచిన నటన, త‌న పాత్ర కోసం పడ్డ శ్రమ వెండితెరపై ఒక విజువల్ ట్రీట్‌లా ఉంటుందని ప్రశంసించారు. నిజమైన పహిల్వాన్లతో కుస్తీ పట్లు పట్టే క్రమంలో చరణ్ చేతికి గాయమైనా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమా పూర్తి చేసిన వృత్తి నిబద్ధతను ఆయన కొనియాడారు.

ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లతో పాటు విలన్ పాత్ర పోషించిన దివ్యేందు శర్మ స‌హా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొని సందడి చేశారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ వేదికపై ఇచ్చిన లైవ్ మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ భోపాల్ యువతను ఉర్రూతలూగించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన‌ ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.

నార్త్ మార్కెట్‌లో ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ కి ద‌క్కుతున్న‌ ఆదరణ చూస్తుంటే, పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించబోతోందనే నమ్మకాన్ని ఇస్తోంది. రవికిషన్ లాంటి సీనియర్ నటుడు రామ్ చరణ్ సింప్లిసిటీని, `పెద్ది` కంటెంట్‌ను ఒక రేంజులో ప్రశంసించడంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జూన్ మొదటి వారంలో థియేటర్లలోకి రాబోతున్న ఈ క్రేజీ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.