మూతపడే స్థితిలో ఉన్న ఇండస్ట్రీకి ఊపిరి పోసిన సినిమా!
‘తేరే నామ్’ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటుడు రవికిషన్ వెల్లడించారు. తల్లి ప్రోత్సాహంతో 2003లో ‘సయాన్ హమార్’ సినిమా అంగీకరించానని, అది కల్ట్ హిట్‌గా నిలిచి భోజ్‌పురి పరిశ్రమకు కొత్త ఊపిరి పోసిందని తెలిపారు. స్థానిక కథలతో వరుస అవకాశాలు అందుకుని కెరీర్‌లో నిలదొక్కుకున్నానని ‘కాఫీ విత్ కరణ్’లో గుర్తుచేసుకున్నారు.
By: Srikanth Kontham | 26 Nov 2026 2:20 PM ISTసల్మాన్ ఖాన్ నటించిన `తేరే నామ్` వంటి హిట్ సినిమాలో కనిపించిన తర్వాత కూడా బాలీవుడ్‌లో అవకాశాలు రాలేదని ఆ సమయంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటుడు రవికిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. `కాఫీ విత్ కరణ్ సీజన్ 9`లో అక్షయ్ కుమార్‌తో కలిసి పాల్గొన్న రవి కెరీర్‌లో ఎదురైన క్లిష్టమైన రోజులను.. భోజ్‌పురి సినిమా తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో వివరించారు. అవకాశాల కోసం వెతికి వెతికి అలసిపోయిన సమయంలో భోజ్‌పురి నిర్మాత మోహన్ ప్రసాద్ నుంచి ఫోన్ వచ్చిం దని రవికిషన్ గుర్తు చేసుకున్నారు.
`అప్పట్లో భోజ్‌పురి చిత్ర పరిశ్రమ దాదాపు మూతపడే స్థితిలో ఉండటంతో ఆ సినిమా చేయాలా ?వద్దా? అని సందేహించాను. కనీసం మన ఊరి ప్రజలైనా నిన్ను తెరపై చూసి సంతోషిస్తారంటూ నా తల్లి ఇచ్చిన ధైర్యంతో ఆ ప్రాజెక్టుకు అంగీకరించాను. 2003లో రిలీజ్ అయిన `సయాన్ హమార్` చిత్రం కల్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో పడకేసిన భోజ్‌పురి ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరి పోసిందని` రవికిషన్ పేర్కొన్నారు.
హిందీ సినిమాల్లో పనిచేస్తూ నేర్చుకున్న మెళకువలన్నింటినీ భోజ్‌పురి చిత్రాల్లో ఉపయోగించానని తెలిపారు. అప్పట్లో బాలీవుడ్ పాశ్చాత్య పోకడలతో అంతర్జాతీయ స్థాయి సినిమాల వైపు చూస్తుండగా తాను మాత్రం మన నేల స్వభావానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకున్నానని వివరించారు. బాలీవుడ్‌లో అందరూ పిజ్జాలు.. బర్గర్లు వడ్డిస్తుంటే తాను భోజ్‌పురి సినిమాల్లో `లిట్టీ చోఖా` వడ్డించానని రవికిషన్ సరదాగా పోల్చారు.
ఆ దేశీయ ఫార్ములా అద్భుతంగా పనిచేసిందని ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. వరుస సినిమాలతో రోజుకు మూడు నాలుగు షిఫ్టులు పనిచేసే స్థాయికి ఎదిగానని తెలిపారు. ఈ సమయంలో రవికిషన్ ప్రయాణాన్ని విన్న అక్షయ్ కుమార్ కూడా ఆయన పట్టుదలను మెచ్చుకున్నారు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా చేతికి వచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడం వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని అక్షయ్ ప్రశంసించారు. నిరంతరం పని చేయడమే అసలైన విజయ రహస్యమని రవికిషన్ కెరీర్‌ను ఉదాహరణగా చూపించారు.
ఇటీవలి కాలంలో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రవికిషన్ బిజీగా మారారు. `లాపతా లేడీస్`, `మామ్లా లీగల్ హ` సిరీస్‌లతో పాటు ఇటీవల రిలీజ్ అయిన `పెద్ది`, `ధమాల్ 4`, `మీర్జాపూర్: ది మూవీ` చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం `నాగ్‌జిల్లా`, `ఖోస్లా కా ఘోస్లా 2` సినిమాలతో పాటు బెంగాలీ దర్శక ద్వయం నందితా రాయ్, శిబోప్రసాద్ ముఖర్జీ తెరకెక్కిస్తన్న కొత్త చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
