Begin typing your search above and press return to search.

'రేసు గుర్రం' న‌టుడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

`రేసు గుర్రం` చిత్రంలో త‌న‌దైన అద్భుత న‌ట‌న‌తో అల‌రించిన బాలీవుడ్ న‌టుడు ర‌వికిష‌న్ రాజ‌కీయాల్లోను చురుగ్గా ఉన్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   8 Nov 2025 3:50 PM IST
రేసు గుర్రం న‌టుడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
X

`రేసు గుర్రం` చిత్రంలో త‌న‌దైన అద్భుత న‌ట‌న‌తో అల‌రించిన బాలీవుడ్ న‌టుడు ర‌వికిష‌న్ రాజ‌కీయాల్లోను చురుగ్గా ఉన్న సంగ‌తి తెలిసిందే. భాజ‌పా ఎంపీగా ఆయ‌న ప్ర‌జా జీవితంలో సేవాకార్య‌క్ర‌మాల‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయ‌న‌కు పంజాబీ డాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపు కాల్ రావ‌డం సంచ‌ల‌న‌మైంది. ర‌వికిషన్ ప్ర‌స్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు భాజ‌పా త‌ర‌పున‌ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు.

మేం అత‌డిని చూసుకుంటాం! అంటూ హ‌త్యా బెదిరింపును ఎదుర్కొన్నాడు. కాల్ చేసిన వ్య‌క్తులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన వాళ్ల‌మ‌ని చెప్పుకున్న‌ట్టు తెలిసింది. రామ్‌గఢ్ తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ విహార్ విస్తార్ కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న ఎంపీ జ్యోతిష్కుడు ప్రవీణ్ శాస్త్రి మొబైల్ ఫోన్‌కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది. నాలుగు రోజుల క్రితం తనకు 7904161800 నంబ‌ర్ నుంచి ఫోన్ కాల్ లో వ‌చ్చిన‌ బెదిరింపు వివరాలను ప్రవీణ్ శాస్త్రి వివరించారు.

ఈసారి మోడీ - యోగి ఇద్దరూ వెళ్లిపోతారు! అని బెదిరిస్తూ, ఎంపీ రవి కిషన్‌ను `జాగ్రత్తగా చూసుకుంటా`నని స‌ద‌రు గ్యాంగ్ స్ట‌ర్ బెదిరించాడు. బెదిరింపు తర్వాత ప్ర‌వీణ్‌ శాస్త్రి రామ్‌గఢ్ తాల్ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేశారు. తాజా బెదిరింపును అనుస‌రించి ర‌వికిష‌న్ తీవ్ర‌మైన ప్ర‌మాదంలో ఉన్నాడ‌ని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అత‌డికి ఉన్న ప్ర‌మాదం దృష్ట్యా పోలీసులు భ‌ద్ర‌త పెంచాల‌ని కోరుతున్నారు.

ఎంపీ రవి కిషన్ ప్రస్తుతం ప్రజా జీవితంలో చాలా చురుగ్గా ఉన్నారని , బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ శాస్త్రి ప్రభుత్వానికి భద్రతను పెంచాలని లేఖ రాశారు.

ఎంపీ రవికిష‌న్ అధికార పార్టీ భాజ‌పా త‌ర‌పున‌ ప్రచార కార్య‌క్ర‌మాలలో చాలా చురుగ్గా ఉన్నారు. అతడికి బెదిరింపులు రావ‌డంతో భాజ‌పా నేత‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుండి వచ్చిన కాల్ ను అనుస‌రించి పూర్తి స‌మాచారం తెలుసుకునేందుకు, బెదిరింపు స్థాయిని అంచ‌నా వేయ‌డానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇంత‌కుముందు స‌ల్మాన్ ఖాన్ స్నేహితుడు, ప్ర‌ముఖ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీని దారుణంగా కాల్చి చంపిన సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్‌ని అత‌డి కుటుంబాన్ని చంపేస్తామ‌ని ప‌దే ప‌దే హెచ్చ‌రిక‌లు పంపుతున్నాడు. ఇప్పుడు మ‌రో న‌టుడు ర‌వికిష‌న్ కి గ్యాంగ్ స్ట‌ర్ నుంచి బెదిరింపులు రావ‌డంతో సెల‌బ్రిటీ ప్ర‌పంచం ఆందోళ‌న‌లో ఉంది. పోలీసులు ప్ర‌స్తుతం ర‌వికిష‌న్ బెదిరింపుల మ్యాట‌ర్ ని సీరియ‌స్ గా తీసుకున్నార‌ని స‌మాచారం.