Begin typing your search above and press return to search.

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’లో లక్ష్మణుడిగా నటించిన రవి దూబే భారతీయ ఇతిహాసాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఈ సినిమాతో లభించిందని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను మార్చకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కథలను చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు. నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీ ప్రయత్నాన్ని ప్రశంసించారు. మొదటి భాగానికి వచ్చిన ఆదరణతో రెండో భాగంపై అంచనాలు పెరిగాయి. వచ్చే ఏడాది రెండో భాగం విడుదల కానుంది.

By:  Srikanth Kontham   |   6 Nov 2026 3:00 PM IST
భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!
X

భారతీయ చారిత్రక.. పౌరాణిక ఇతిహాసాలు మన దేశానికే పరిమితం కాలేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయికి చేరాయని నటుడు రవి దూబే అభిప్రాయపడ్డారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రిలీజ్ అయిన `రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్` చిత్రంలో శ్రీరాముడి తమ్ముడైన లక్ష్మణుడి పాత్రలో న‌టించిన దూబే ఇటీవలి ఇంటర్వ్యూలో సినిమా ప్రాముఖ్యత గురించి పలు కీలక విషయాలను పంచుకున్నారు. మన సంస్కృతిని, పురాణాలను ఏమాత్రం మార్చకుండా గ్లోబల్ స్థాయిలో ప్రెసెంట్ చేసే అవకాశం ఈ సినిమా ద్వారా లభించిందని తెలిపారు.

భారతదేశానికి వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రం , ప్రపంచాన్ని ఆకట్టుకునే అద్భుతమైన పాత్రలు ఉన్నాయని రవి దూబే పేర్కొన్నారు. నేడు ఇండియన్ స్టోరీస్ గ్లోబల్ స్టేజ్‌పై సత్తా చాటుతున్నాయని, ఈ తరుణంలో పురాణ కథలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వెండితెరకు ఎక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఒక సినిమాగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆలోచింపజేసే ఓ గొప్ప దృశ్య కావ్యంగా నిలుస్తుందని నమ్ముతున్నారు.

ముఖ్యంగా నిర్మాత నమిత్ మల్హోత్రా .. దర్శకుడు నితీష్ తివారీ చేపట్టిన సాహసం కేవలం ఒక సినిమాతో సరిపోదని.. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని గ్లోబల్ ప్రాజెక్ట్‌లకు ఇది బలమైన పునాది వేస్తుందని రవి దూబే అన్నారు. భారతీయతను ఎక్కడా కోల్పోకుండా? ఎలాంటి రాజీ పడకుండా మన కథలను ప్రపంచానికి చెప్పొచ్చ‌ని ఈ చిత్రం నిరూపిస్తోందని కొనియాడారు. ఇతిహాసాల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ సినిమా మైలురాయిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే గ్లోబల్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసే పేరుతో దేశీయతను, సంస్కృతిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదని రవి దూబే స్పష్టం చేశారు. మనదైన ప్రత్యేకతను కాపాడుకుంటూనే భారీ బడ్జెట్, ఉన్నతమైన సాంకేతిక విలువలతో సినిమాలు తీస్తే ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుందని అభిప్రాయపడ్డారు. భారతీయ సినిమాకు ఇది సరికొత్త స్వర్ణయుగమని.. ప్రపంచాన్ని విస్మయపరిచే సత్తా మన కథలకు ఉందని పేర్కొన్నారు. రామాయ‌ణంలో నటుడిగా తాను కూడా భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణమని రవి దూబే ఆనందం వ్యక్తం చేశారు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన రామాయ‌ణం మొద‌టి భాగం గ్రాండ్ స‌క్సెస్ అయింది. సినిమాకు మంచి రివ్యూలు వ‌చ్చాయి. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ఈ నేప‌థ్యంలో రెండ‌వ భాగంపై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ఇప్ప‌టికే ఆ భాగం షూటింగ్ కూడా శ‌ర వేగంగా జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది రెండ‌వ భాగాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే కొన‌సాగింపుగా `రామాయ‌ణం` మూడ‌వ భాగం కూడా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.