Begin typing your search above and press return to search.

PM బయోపిక్.. మోదీ తల్లిగా ఎవరు నటిస్తున్నారంటే?

అయితే ప్రీ లుక్ పోస్టర్ సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. భారత ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు డిజైన్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

By:  M Prashanth   |   11 Nov 2025 9:41 PM IST
PM బయోపిక్.. మోదీ తల్లిగా ఎవరు నటిస్తున్నారంటే?
X

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. టైటిల్ అనౌన్స్ మెంట్ తోపాటు ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. మా వందే టైటిల్ తో మూవీ రూపొందుతోంది. ట్యాగ్ లైన్ ది ఆంథెమ్ ఆఫ్ ఎ మదర్ గా ఉంది.

అయితే ప్రీ లుక్ పోస్టర్ సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. భారత ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు డిజైన్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో పార్లమెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఎన్నో పోరాటాల కన్నా.. తల్లి సంకల్ప బలం గొప్పది అంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం.

అదే సమయంలో సినిమాలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను మాలీవుడ్ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పోషిస్తుండగా.. పీఎం తల్లి హీరాబెన్ లో ఎవరు కనిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఆ రోల్ లో కనిపించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే ఆమె సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తారని సమాచారం. దీంతో అప్డేట్ కోసం సినీ ప్రియులు, మోదీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. రవీనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. తెలుగు దర్శకుడు క్రాంతి కుమార్ సీహెచ్ తెరకెక్కిస్తున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వీర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే మూవీకి పలువురు టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. బాహుబలితో పాటు వివిధ సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాలకు వర్క్ చేసిన కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

సలార్, కేజీఎఫ్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కింగ్ సోలొమన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా భాషల్లో సినిమా రూపొందుతోంది. ఇంగ్లీష్ లో కూడా రూపుదిద్దుకుంటోంది. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.