మూడేళ్లుగా వెంటాడి వేధిస్తున్నారు.. నేరుగా CMకి నటి ఫిర్యాదు
సైబర్ వేధింపులపై చట్టపరమైన రక్షణ వివరాల్లోకి వెళితే.. రవీనా రవి వంటి మహిళా బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మన దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి.
By: Sivaji Kontham | 6 Feb 2026 1:21 AM ISTడబ్బింగ్ ఆర్టిస్ట్ కం నటి రవీనా రవి తాజా ఫిర్యాదు సంచలనంగా మారింది. ఈ తరహా వేధింపుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రవీనా రవి గత మూడు సంవత్సరాలుగా కొందరు వ్యక్తులు తనను ఆన్‌లైన్‌లో నిరంతరం వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ , రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ట్యాగ్ చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రవీనా ఆవేదనను వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకరమైన కామెంట్స్ చేయడం, అసభ్యకరంగా చిత్రించడం, వ్యక్తిగత దూషణలకు దిగడం వంటి చర్యల ద్వారా తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని సదరు నటీమణి ఆవేదన చెందారు. రవీనా ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి తమిళనాడు పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు సమాచారం. గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఏళ్ల తరబడి ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అభ్యంతరకర సందేశాలు పంపే వారిపై ఆమె నిరంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. రవీనా రవి సమస్య కూడా ఇంచుమించు అలానే ఉంది.
రవీనా రవి దక్షిణాది సినిమాల్లో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్, కాజల్ అగర్వాల్, బ్రిటీష్ నటి ఎమీజాక్సన్ వంటి స్టార్ హీరోయిన్లకు ఆమె గొంతు అందించారు. నటిగా కూడా `లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్` వంటి చిత్రంలోను నటించారు.
రక్షణకు బలమైన చట్టాలున్నాయి:
సైబర్ వేధింపులపై చట్టపరమైన రక్షణ వివరాల్లోకి వెళితే.. రవీనా రవి వంటి మహిళా బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మన దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఐటి యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం నేరం. ఐపిసి సెక్షన్ 354డి ప్రకారం.. ఆన్‌లైన్‌లో మహిళలను వెంబడించడం శిక్షార్హమైన నేరం. సామాన్యులు కూడా cybercrime.gov.in ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా ఇలాంటి వేధింపులకు గురైతే భయపడకుండా సైబర్ పోలీసులను ఆశ్రయించవచ్చు.
సైబర్ వేధింపులపై నటీమణుల ఫిర్యాదులు:
సైబర్ వేధింపుల గురించి గతంలో పలువురు కథానాయికలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంతకుముందు తనపై డీప్ ఫేక్ వేధింపుల గురించి రష్మిక మందన్న సైబర్ క్రైమ్ ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రష్మిక ముఖాన్ని వేరొక యువతి శరీరానికి తగిలించి డీప్ ఫేక్ కి పాల్పడటం కలకలం రేపింది. దీనిపై రష్మిక గట్టిగా స్పందించడంతో ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేసిన వారిపై అనుపమ పరమేశ్వరన్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్మయి శ్రీపాద, షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే వంటి ప్రముఖులు కూడా పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో ఎదురయ్యే అసభ్యకర కామెంట్స్, వేధింపులపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
వేధింపులు ఎన్ని రకాలు?
ఇటీవలి కాలంలో మార్ఫింగ్, డీప్ ఫేక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఏఐ ఉపయోగించి మరింత సులువుగా అసభ్యకర ఫోటోలు, వీడియోలు సృష్టించడం యూత్ నిత్యవ్యాపకంగా మారింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని అనుసరించడం, నిరంతరం అసభ్యకర సందేశాలు పంపడం వంటి దుర్మార్గాలు పెరిగాయి. అలాగే నటీమణులను అసభ్యకర భాషలో దూషించే నేరాలకు యూత్ పాల్పడుతుండటం విచారకరం. నటీమణుల ఫోన్ నంబర్లు లేదా ఇంటి అడ్రస్‌లను బహిర్గతం చేయడం కూడా సైబర్ నేరం కిందికే వస్తుంది.
