Begin typing your search above and press return to search.

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

‘మీర్జాపూర్: ది మూవీ’లో బీనా త్రిపాఠి గత ప్రేమకథను చూపించడం తనకు సంతోషాన్నిచ్చిందని రసికా దుగల్ తెలిపారు. బిర్జుతో ఆమెకు ఉన్న బంధం, ఆ ప్రేమ విషాదాంతం కావడం బీనా పాత్ర నిర్ణయాలకు లోతు ఇస్తాయని చెప్పారు. అదనపు సన్నివేశాలతో సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

By:  Srikanth Kontham   |   19 Nov 2026 1:26 PM IST
బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!
X

`మీర్జాపూర్` సిరీస్ అనగానే కళ్లముందు మెదిలే పదునైన పాత్రలలో బీనా త్రిపాఠి ఒకటి. పంకజ్ త్రిపాఠి పోషించిన కాలీన్ భయ్యా రెండో భార్యగా అధికారానికి.. ఆధిపత్యానికి మధ్య నలిగిపోతూనే తనదైన ఎత్తుగడలతో పావులు కదిపే పాత్రను రసికా దుగల్ ఎంతటి సహజత్వంతో పండించారో తెలిసిందే. 2018లో మొదలైన ప్రయాణంలో సీజన్ల కొద్దీ బీనా పాత్ర ఎన్నో మలుపులు తిరిగింది. ఇటీవ‌లే `మీర్జాపూర్: ది మూవీ` రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీనా గతానికి సంబంధించిన ఓ కీలక కోణాన్ని తెరపై చూపించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. ఆ నేపథ్యం ఇన్నాళ్లూ లోటుగా అనిపించిందని రసికా దుగ‌ల్ ఓపెన్ అయ్యారు.

మొదటి సీజన్ ముందు జరిగిన కథాంశంతో సినిమా తెరకెక్కగా ఇందులో బీనా జీవితంలోని పాత బంధం గురించి చూపించారు. బిర్జు అనే వ్యక్తితో బీనా గత సంబంధం.. ఆ ప్రేమ విషాదాంతంగా ముగియడం వంటి అంశాలు బీనా పాత్రలోని ఎన్నో నిర్ణయాలకు అర్థాన్ని ఇస్తాయని రసికా వివరించారు. సిరీస్ షూటింగ్ సమయంలోనే ఇలాంటి విషయాలు మనసులో మెదిలినా? తెరపై ఇంత స్పష్టంగా మలచడం మాత్రం ఈ సినిమాలోనే జరిగిందన్నారు.

ప్రతి సీజన్‌లోనూ బీనాకు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇస్తూనే మరోవైపు దాన్ని లాగేసుకుంటూ తిరిగి తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో? చూపిస్తుంటారని రసికా అన్నారు. సినిమాలో ఆ గతం తాలూకు నేపథ్యం తోడవడంతో ఆమె ప్రవర్తన వెనుక ఉన్న లోతు ప్రేక్షకులకు మరింత బాగా అర్ద‌మైంద‌ని అభిప్రాయపడ్డారు. నిజానికి బీనాలోని ఆ చతురత.. పట్టుదల వెనుక ఎన్నో బాధలు.. కోల్పోయిన విషయాలు దాగి ఉన్నాయని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో నిర్మాత ఫర్హాన్ అక్తర్ మీర్జాపూర్ సైతం ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బతికి బట్టకట్టే నైజం ఉన్న పాత్ర బీనాదేనని కొనియాడారు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే బలమైన సర్వైవల్ ఆమెలో ఉంటుందని.. సినిమా క్లైమాక్స్‌కు దగ్గరగా వచ్చే ఓ కీలక సన్నివేశం బీనా మనస్తత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించింద‌ని తెలిపారు.

300 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటిన `మీర్జాపూర్: ది మూవీ` ఇప్పుడు అదనపు సన్నివేశాలతో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెరపై గంభీరంగా కఠినంగా కనిపించిన బీనా త్రిపాఠిలో సున్నితమైన గతాన్ని చూడటం సిరీస్ అభిమానులకు ఖచ్చితంగా ఓ కొత్త అనుభూతిని ఇస్తుందన‌డంలో సందేహం లేదు. అలాగే `మీర్జాపూర్ 2` రూపంలో మ‌రో సినిమా కూడా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ మొద‌ల‌వ‌డానికి మాత్రం స‌మ‌యం ప‌డుతుంది.