Begin typing your search above and press return to search.

వాంపైర్ పాత్ర‌లో ర‌ష్మిక కాదు స‌మంత‌?

తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో వాంపైర్ పాత్ర కోసం మ‌డోక్ ఫిలింస్ దినేష్ విజ‌న్ బృందం తొలుత స‌మంత‌ను సంప్ర‌దించారు.

By:  Sivaji Kontham   |   2 Oct 2025 4:00 PM IST
వాంపైర్ పాత్ర‌లో ర‌ష్మిక కాదు స‌మంత‌?
X

దినేష్ విజన్ హర్రర్- కామెడీ విశ్వంలో కొత్త సినిమా -థామ‌. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ త‌దిత‌రులు న‌టించారు. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌లై ఆక‌ట్టుకుంది. పోస్ట‌ర్లు, టీజ‌ర్ స‌హా ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌లైన విజువ‌ల్స్ లో ర‌ష్మిక మంద‌న్న పాత్ర అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో క‌థానాయిక‌గా స‌త్తా చాటుతున్న ర‌ష్మిక మంద‌న్న‌కు ఇది పూర్తిగా భిన్న‌మైన అవ‌కాశం. మొద‌టిసారి త‌న కెరీర్ లో వాంపైర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌డం అభిమానుల్లో ఆస‌క్తిని పెంచుతోంది.

తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో వాంపైర్ పాత్ర కోసం మ‌డోక్ ఫిలింస్ దినేష్ విజ‌న్ బృందం తొలుత స‌మంత‌ను సంప్ర‌దించారు. కానీ అప్ప‌టికే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న స‌మంత దీనికి అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. స‌మంత రిజెక్ట్ చేసిన త‌ర్వాతే ఈ పాత్ర‌లోకి ర‌ష్మిక మంద‌న్న‌ను దినేష్ విజ‌న్- అమ‌ర్ కౌశిక్ (ర‌చ‌యిత‌)- ఆదిత్య స‌ర్పోద‌ర్ (ద‌ర్శ‌కుడు) బృందం ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా- అప‌ర‌శ‌క్తి ఖురానా సోద‌రులు మొద‌టిసారి క‌లిసి న‌టిస్తున్నారు. దీపావ‌ళికి ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ఈ విశ్వంలో ఇప్పటికే స్త్రీ, స్త్రీ 2, ముంజ్య, భేదియ లాంటి సినిమాలు విడుద‌ల‌య్యాయి. అదే స‌మ‌యంలో ఆయుష్మాన్ తో వాంపైర్ సినిమా కోసం చాలా కాలంగా మ‌డోక్ సంస్థ చ‌ర్చించింది. అప్ప‌ట్లోనే స‌మంతను థామ కోసం ఎంపిక చేసుకుని అడ్వాన్స్ కూడా చెల్లించారు. కానీ స‌మంత తాను ఉన్న అనారోగ్య స్థితిలో ఈ చిత్రంలో న‌టించ‌లేన‌ని దినేష్ విజ‌న్ కి తిరిగి త‌న అడ్వాన్స్ ని వెన‌క్కి ఇచ్చేసింద‌ని కూడా తెలుస్తోంది. అప్ప‌టికే స‌మంత క్యూలో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ రాజ్ నిడిమోరు - కృష్ణ డికె రూపొందించిన `సిటాడెల్: హనీ బన్నీ` సిరీస్ కోసం మాత్రమే ప‌ని చేసింది. థామ‌లో న‌టించే అవ‌కాశం లేద‌ని చెప్ప‌డ‌మే గాక‌, కొంద‌రు న‌టీమ‌ణుల పేర్ల‌ను కూడా స‌మంత వాంపైర్ పాత్ర కోసం సూచించింద‌ని కూడా తెలుస్తోంది.

థామ చిత్రం కోసం చాలా కాలంగా వ‌ర్క్ జ‌రుగుతోంది. గతంలో మేక‌ర్స్ `వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్` అని పేరు పెట్టారు. కానీ త‌ర్వాత `థామ‌`గా మార్చారు. అప్పటికే విక్కీ కౌశల్ - లక్ష్మణ్ ఉటేకర్ `చావా` కోసం రష్మికతో కలిసి పనిచేస్తున్న నిర్మాతలు వెంట‌నే `థామ` కోసం ర‌ష్మిక‌ను ఎంపిక చేయ‌డం స‌రైన‌ద‌ని భావించారు. ముంజ్య విడుదల సమయంలో ర‌ష్మిక‌ను నిర్మాత‌లు ఈ పాత్ర కోసం సంప్రదించారు.

రష్మిక ప్రస్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. థామ‌తో పాటు, కాక్‌టెయిల్ 2లో పనిచేస్తోంది. ఇది చావా -థామ త‌ర్వాత అదే నిర్మాణ సంస్థ- మ‌డోక్‌తో ర‌ష్మిక‌ మూడవ చిత్రం. కాక్ టైట్ 2 కి హోమి అడాజానియా దర్శకుడు. షాహిద్ కపూర్ - కృతి సనన్ ఇందులో ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు.