Begin typing your search above and press return to search.

రియల్ హీరో.. ది గర్ల్ ఫ్రెండ్ కోసం రష్మిక త్యాగం!

ఈవెంట్ లో భాగంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ రష్మిక రియల్ హీరో అని చెబుతూనే ఆమె ఈ సినిమా కోసం ఏమేం త్యాగం చేసింది అనే విషయాలను చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

By:  Madhu Reddy   |   25 Oct 2025 3:26 PM IST
రియల్ హీరో.. ది గర్ల్ ఫ్రెండ్ కోసం రష్మిక త్యాగం!
X

పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతూ నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకున్న రష్మిక మందన్న.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా పుష్ప సినిమాతో మొదలైన ఆమె సక్సెస్ పరంపర పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర, థామా ఇలా వరుసగా అన్ని మంచి విజయాలతో దూసుకుపోతోంది. మధ్యలో బాలీవుడ్లో సికందర్ అంటూ సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేసింది కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈ సినిమా నెగిటివ్ ప్రభావం రష్మికపై ఏ మాత్రం పడలేదు.

ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా.. రష్మిక లీడ్ రోల్ పోషిస్తూ త్వరలో రాబోతున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ లో భాగంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ రష్మిక రియల్ హీరో అని చెబుతూనే ఆమె ఈ సినిమా కోసం ఏమేం త్యాగం చేసింది అనే విషయాలను చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

విషయంలోకి వెళ్తే.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో భాగంగా ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. "ఈ సినిమా షూటింగ్ మేము ఎలా చేశామంటే.. రష్మిక పుష్ప 2 తోపాటు వేరే చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. ముంబై - హైదరాబాద్ అంటూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల కారణంగా చాలా బిజీగా గడిపింది. అలా ఆమె బిజీ షెడ్యూల్లో కూడా మా సినిమా కోసం సమయాన్ని కేటాయించింది. డేట్స్ ఇవ్వడానికి రష్మిక దాదాపు రెండు నుండి మూడు నెలలు సరిగ్గా నిద్రపోలేదు. కేవలం రోజుకి రెండు మూడు గంటలే నిద్రపోయారు. రాత్రంతా పుష్ప 2 షూటింగ్ చేసి.. అర్ధరాత్రి 2 గంటలకు ప్యాకప్ చెప్పి.. ఉదయం 7 గంటలకే మేకప్ తో సహా మా సినిమా షూటింగ్ సెట్ లో ఉండేవారు. అంతేకాదు వేరే సినిమా కోసం ఫారిన్ వెళ్ళిన రష్మిక తెల్లవారుజామున 4గంటలకే హైదరాబాదులో ఫ్లైట్ ల్యాండ్ అయితే ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి అక్కడే డ్రెస్సింగ్ రూమ్ లో రెస్ట్ తీసుకొని మళ్ళీ 8:00 గంటలకి మా సినిమా కోసం సిద్ధమయ్యేవారు. ఇలాంటి డెడికేషన్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నా అందరిలో ఉండదు. ఈ మధ్యకాలంలో ఇలా పనిచేసిన వ్యక్తులలో రష్మిక మొదటి స్థానంలో ఉంటారు. ఈమె ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ కానీ ఇప్పుడు రియల్ హీరో.. మాకు.. మా సినిమాకు" అంటూ రష్మికపై ప్రశంసలు కురిపించారు.

అలాగే రష్మిక ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ గురించి కూడా ధీరజ్ మాట్లాడుతూ.. "ఈ సినిమా కథ విని రష్మిక ఓకే చేసిన తర్వాత ఆమె మేనేజర్ ని నేను రెండు రోజులు ఫాలోఅప్ చేశాను.. కలుద్దాం అన్నాను. రెమ్యూనరేషన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ రష్మిక మేనేజర్ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. దాంతో నేరుగా రష్మిక దగ్గరికి వెళ్లాను. ఆవిడ ముందు ఈ సినిమా తీయండి. సినిమా రిలీజ్ అయిన తర్వాతే నాకు రెమ్యూనరేషన్ ఇవ్వండి. ముందే నాకేం వద్దు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే తీసుకుంటాను అని చెప్పింది. మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు." అంటూ రష్మిక గురించి ధీరజ్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే తన నిద్రను, ఆరోగ్యాన్ని కూడా ఈ సినిమా కోసం త్యాగం చేసింది రష్మిక అని తెలిసి ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.