Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ భార్య శ్రీ‌వ‌ల్లి మ‌రో ఉగ్ర రూపం?

బాలీవుడ్ లో ర‌ష్మిక మంద‌న్న లైన‌ప్ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ భామ అమితాబ్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్ల‌తో కెరీర్ ఆరంభ‌మే న‌టించేసింది.

By:  Sivaji Kontham   |   19 Aug 2025 9:46 AM IST
పుష్ప‌రాజ్ భార్య శ్రీ‌వ‌ల్లి మ‌రో ఉగ్ర రూపం?
X

బాలీవుడ్ లో ర‌ష్మిక మంద‌న్న లైన‌ప్ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ భామ అమితాబ్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్ల‌తో కెరీర్ ఆరంభ‌మే న‌టించేసింది. ఆ త‌ర్వాత ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి పెద్ద స్టార్ స‌ర‌స‌న 'యానిమ‌ల్' చిత్రంలో క‌థానాయిక‌గా ఎంపికైంది. ఈ చిత్రంలో ఎగ్రెస్సివ్ భ‌ర్త‌ను ధీటుగా ఎదుర్కొనే ధైర్యశాలి, మాట‌కారి అయిన భార్య‌గా ర‌ష్మిక ఎంతో అద్భుతంగా న‌టించి మ‌న‌సులు గెలుచుకుంది.


అదే స‌మ‌యంలో పుష్ప‌, పుష్ప 2 చిత్రాల్లో శ్రీ‌వ‌ల్లిగా ప్ర‌జ‌ల‌ హృద‌యాల్లో ప‌ర్మినెంట్ గా చోటు సంపాదించుకుంది. ర‌ఫ్‌గా, ర‌గ్గ్ డ్ గా ఉండే పుష్ప‌రాజ్ లాంటి స్మ‌గ్ల‌ర్ ని కొంగున క‌ట్టేసుకునే పిల్ల‌గా ర‌ష్మిక న‌ట‌న సినిమా ఆద్యంతం ఆక‌ట్టుకుంది. వ‌రుస‌గా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో ర‌ష్మిక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం ఇత‌ర నాయిక‌ల‌కు కంట‌గింపుగా మారింది. ఇలాంటి గొప్ప అవ‌కాశాలు త‌మ‌కు రాలేదని భావించారు చాలామంది స‌హ‌న‌టీమ‌ణులు. అంత‌గా శ్రీ‌వ‌ల్లి పాత్ర‌తో ప్రేమ‌లో ప‌డ్డారు.

ఇప్పుడు మ‌రోసారి ర‌ష్మిక మంద‌న్న మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈసారి మ‌డాక్ ఫిలింస్ నిర్మిస్తున్న హార‌ర్ చిత్రం 'థామ‌'లో త‌డ‌కా అనే స్త్రీ శ‌క్తిగా క‌నిపించ‌బోతోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా 'ఇన్సానియత్ కి ఆఖ్రీ ఉమీద్' (మానవత్వానికి చివరి ఆశ) అనే నినాదంతో దూసుకొచ్చే యువ‌కుడు అలోక్ పాత్రలో న‌టిస్తున్నాడు. అలోక్ గ్రేషేడ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడా? లేక ఇది లోక ర‌క్ష‌కుడి పాత్ర‌నా? అన్న‌ది రివీల్ చేయాల్సి ఉంది. అత‌డు ఈ లోకానికి ర‌క్ష‌కుడా? భ‌క్ష‌కుడా? అనేది కావాల‌నే దాచి ఉంచింది చిత్ర‌బృందం. 'రోష్ని కి ఏక్ హి పెహ్లి కిరణ్' (వెలుగు మొదటి కిరణం) చెప్పుకునే అంద‌మైన అమ్మాయి తడకాగా రష్మిక మందన్న నటించింది. గంద‌ర‌గోళం, కుట్ర‌లు, మోసాలు ఉండే పాత్ర‌ల న‌డుమ ఆశాదీపం ఈ పాత్ర అని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది.

ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ నవాజుద్దీన్ సిద్ధిఖీ 'అంధేరే కా బాద్షా' (చీకటి రాజు) గా పిలవబ‌డే దుష్ట యక్షసన్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. విల‌న్ గా అత‌డు త‌న‌లోని కొత్త షేడ్స్ ని బ‌య‌ట‌కు తీయ‌బోతున్నాడు. భూల్ భుల‌యా 3 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌డోక్ ఫిలింస్ హార‌ర్ ఫ్రాంఛైజీలో సినిమాల‌ను వ‌రుస‌గా నిర్మించ‌నుంది. ఈలోగానే థామ రూపంలో మ‌రో కొత్త ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెరుగుతోంది. ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.