అర్థం కాని శ్రీవల్లి.. ఆ అదృష్టం నాకే దక్కింది..
రష్మిక మాట్లాడుతూ.. "పుష్ప సినిమా చేసేటప్పుడు ఆ కథ, ఆ కథలోని నా పాత్ర రెండూ కూడా నాకు గందరగోళంగా అనిపించాయి.
By: Madhu Reddy | 29 Oct 2025 8:54 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న 'ఛలో' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది కానీ పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు అయితే లభించలేదు. కానీ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి, ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాలో తన నటనతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా పేరు దక్కించుకుంది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో అప్పటినుంచి ఈమె దశ తిరిగిపోయిందని చెప్పవచ్చు.
ఈ సినిమా తర్వాత వచ్చిన పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర, థామా అంటూ వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు 'ది గర్ల్ ఫ్రెండ్' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జోరుగా పాల్గొంటూ ఎన్నో విషయాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే పుష్ప సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
రష్మిక మాట్లాడుతూ.. "పుష్ప సినిమా చేసేటప్పుడు ఆ కథ, ఆ కథలోని నా పాత్ర రెండూ కూడా నాకు గందరగోళంగా అనిపించాయి. సుకుమార్ ప్రపంచ దృష్టిని ఆకర్షించడం పై దృష్టి పెట్టారు. అందుకే నాకు కథ మీద క్లారిటీ రాలేదు. షూటింగ్ కి వెళ్లడం.. ఆయన చెప్పిన సీను చేయడం.. వచ్చేయడం.. ఇలాగే ఉండేది. అసలు కథలో ఏం జరుగుతోంది? అనే విషయం కూడా నాకు అర్థం అయ్యేది కాదు. ఒక కీ ఇచ్చే బొమ్మలాగే నేను ఈ సినిమాలో పని చేశాను.
పార్ట్ 2 వచ్చేసరికి ఎన్నో విషయాల మీద క్లారిటీ వచ్చింది. ముందు సుకుమార్ అలా ఎందుకు చేశారో అర్థం కాలేదు కానీ పుష్ప 2 నటించడాన్ని ఆస్వాదించాను. నా కెరియర్ లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ చిత్రం అది. ఒక నటి 5 నిమిషాల పాటు కేవలం తను మాత్రమే పెర్ఫామ్ చేసే అవకాశం అసలు వస్తుందనే నమ్మకం కూడా లేదు. కానీ నాకు జాతర ఎపిసోడ్లో ఆ అద్భుతమైన అవకాశం వచ్చింది. అది నా అదృష్టం.
అసలు ఈ సీన్ చేస్తున్నప్పుడు సెట్లో ఎవరు? ఎక్కడ ? ఏం చేస్తున్నారు? అనేది కూడా పట్టించుకోలేదు. నన్ను నేను పూర్తిగా కథలో లీనమైపోయి దృష్టి పెట్టి స్వేచ్ఛగా నటించాను.. అందుకే ఆ సీన్ కూడా చాలా బాగా వచ్చింది" అంటూ రష్మిక తెలిపింది. మొత్తానికి అయితే శ్రీవల్లి అర్థం కాలేదని చెప్పిన రష్మిక పార్ట్ 2 లో తనను తాను మైమరిచిపోయి నటించే అదృష్టం లభించింది అంటూ క్లారిటీ ఇచ్చింది.
