Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌, మృణాల్ , న‌భా న‌టేష్ ల‌కు క‌లిసి రాని ప్ర‌య‌త్నాలు!

పరిశ్రమలో హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన కథలను, వైవిధ్య‌భ‌రిత‌ పాత్రలను ఎంచుకుంటూ తమ పరిధులను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Srikanth Kontham   |   3 Aug 2026 4:00 AM IST
ర‌ష్మిక‌, మృణాల్ , న‌భా న‌టేష్ ల‌కు క‌లిసి రాని ప్ర‌య‌త్నాలు!
X

పరిశ్రమలో హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన కథలను, వైవిధ్య‌భ‌రిత‌ పాత్రలను ఎంచుకుంటూ తమ పరిధులను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు ప్రతిసారీ ఆశించిన ఫలితాలను ఇవ్వ‌డం లేదు. తాజాగా టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలలోనూ కొందరు అగ్ర నాయికలు చేసిన విభిన్న ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ప్రభావాన్ని చూపలేకపోయాయి.

ఈ కోవలోనే రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, నభా నటేష్ వంటి క్రేజీ భామలు సరికొత్త జోనర్లు .. భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నించారు. 'కాక్‌టెయిల్ 2', 'డెకాయిట్', 'నాగబంధం' వంటి చిత్రాలలో వీరు చేసిన ప్రయోగాలు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీశాయి. కానీ ఆయా చిత్రాల కథాకథనాలు, వీరు పోషించిన పాత్రలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గ్లామర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఇంటెన్స్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను ఎంచుకునే క్రమంలో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలపై దృష్టి పెట్టారు. అయితే ఆమె చేసిన ఆ ప్రత్యేక ప్రయత్నాలు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి. పాత్రల ఎంపికలో కొత్తదనం ఉన్నా? కథనంలో లోపాలు ర‌ష్మిక‌ కష్టాన్ని వెనక్కి నెట్టేలా చేశాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో వరుస విజయాలు అందుకున్న మృణాల్ ఠాకూర్ కూడా సరికొత్త జోనర్లలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేశారు.

'డెకాయిట్' లాంటి రా అండ్ రస్టిక్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలలో ఆమె చేసిన సాహసం అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ వెండితెరపై ఆ పాత్ర తాలూకు లోతు, ఎమోషన్ ప్రేక్షకులను తాకడంలో విఫలమవడంతో ఆ ప్రయత్నం కూడా అనుకున్నంతగా రీచ్ కాలేకపోయింది. గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ కూడా 'నాగబంధం' లాంటి మిథలాజికల్ అడ్వెంచర్ జోనర్ సినిమాలతో సరికొత్తగా ప్ర‌య‌త్నించారు. కానీ ఈ సినిమాల నిర్మాణ శైలి, అనుకున్న విధంగా ఎన్విరాన్‌మెంట్‌ను తెరపై ఆవిష్కరించడంలో జరిగిన పొరపాట్లు ఆమె పాత్రకు పెద్దగా ప్లస్ కాలేదు. దీంతో ఈ భామలందరి కష్టానికి సరైన ఫలితం దక్కలేదనే చెప్పాలి.

ఈ అనుభవాలన్నీ గమనిస్తే స్టార్ హీరోయిన్లు సాధారణ ఇమేజ్ నుండి బయటపడి సరికొత్తగా ప్రయత్నించడం అభినందనీయమే అయినా? కేవలం ప్రయోగాలు చేయడం మాత్రమే సరిపోదు. కథాబలం, బలమైన పాత్ర చిత్రణ ఉంటేనే ఏ నాయికనైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇకపై ఈ భామలు ఆచితూచి అడుగులు వేస్తూ తమలోని నటిని బయటపెట్టే కంటెంట్ ఉన్న బలమైన పాత్రలను ఎంచుకుంటేనే అనుకున్న ఫ‌లితాల‌కు అవ‌కాశం ఉంటుంది.