Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ రేస్!

రష్మిక మందన్న విషయానికి వస్తే అమ్మ‌డి కెరీర్ ఒక వేగవంతమైన ప్రయాణంలా సాగుతోంది.

By:  Srikanth Kontham   |   6 July 2026 10:00 PM IST
టాలీవుడ్ లో  లేడీ సూపర్ స్టార్ రేస్!
X

నయనతార తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను ఎవరు దక్కించుకుంటారనే ? చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో రష్మిక మందన్న - సాయి పల్లవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్ద‌రు తమదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ కెరీర్‌ను విభిన్న దిశల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకరు గ్లామర్ - భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే మరొకరు సహజ నటనతో ప్రత్యేకమైన ముద్ర వేస్తున్నారు.

రష్మిక మందన్న విషయానికి వస్తే అమ్మ‌డి కెరీర్ ఒక వేగవంతమైన ప్రయాణంలా సాగుతోంది.

గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా పుష్ప ప్రాంచైజీ చిత్రాలు అమ్మ‌డిని జాతీయ స్థాయిలో నేషనల్ క్రష్ గా నిలబెట్టాయి. బ్రాండ్ వాల్యూ, భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ బాలీవుడ్ ప్రాజెక్టులతో రష్మిక కమర్షియల్ పవర్‌హౌస్‌గా ఎదుగు తున్నారు. మరోవైపు సాయి పల్లవి మార్గం పూర్తిగా భిన్నమైనది. కేవలం నటనకు, కథలోని బలానికి ప్రాధాన్యతనిస్తూ ఆమె తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. గ్లామర్ షో కంటే పాత్రకు ప్రాణం పోయడం, అద్భుతమైన డ్యాన్స్‌తో మెప్పించడం ఆమె ప్రత్యేకత.

ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల ద్వారా ఇప్పటికే నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో `రామాయణం` వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ఆమె పాన్-ఇండియా స్థాయిలో కీలక నటిగా మారుతున్నారు. ఈ సినిమా స‌క్సెస్ అయితే సాయి ప‌ల్ల‌వి రేంజ్ మారిపోతుంది. పాన్ ఇండియాలోనే పెను సంచ‌ల‌న‌గా మారుతారు. అయితే ఇద్దరు తారల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం వారి ఎంపికల‌లో కనిపిస్తుంది. రష్మిక భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు చేరువవుతుంటే.. సాయి పల్లవి అంత‌రాత్మ‌కు నచ్చిన బలమైన పాత్రలున్న కథలనే ఎంచుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ప్రేక్షకులు ఇద్ద‌ర్నీ వేర్వేరు కోణాల్లో చూస్తున్నారు. రష్మికను ఒక స్టార్ గా... సాయి పల్లవిని ఒక ఆర్టిస్ట్ గా భావిస్తారు. ఈ పోటీలో ఎవరు? విజేతగా నిలుస్తారనేది బాక్సాఫీస్ లెక్క లపైనే కాకుండా కాలక్రమేణా వారు ఎంచుకునే పాత్రల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. లేడీ సూపర్ స్టార్ అంటే భారీ వసూళ్లు సాధించడం మాత్రమే కాదు. పాత్రల ద్వారా ప్రేక్షకులను మైమరిపించే శక్తి కూడా ఉండాలి. రష్మికకు ఉన్న కమర్షియల్ క్రేజ్ ఒక ఎత్తయితే.. సాయి పల్లవికి ఉన్న ఎమోషనల్ కనెక్ట్ మరొక ఎత్తు.

టాలీవుడ్ పరిశ్రమకు ఇద్ద‌రు రెండు కళ్లు వంటి వారు. నయనతార వంటి నటీమణులు ఎలాగైతే విలక్షణమైన పాత్రలతో కెరీర్‌ను మలచుకున్నారో? రష్మిక , సాయి పల్లవి కూడా తమదైన పంథాలో అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా? ఇద్ద‌రి మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీ తెలుగు సినీ పరిశ్రమకు నూతన ఉత్తేజాన్ని అందిస్తుందన‌డంలో సందేహం లేదు.