ఇండియాను రిప్రెజెంట్ చేసే స్టార్‌గా రష్మిక.. మరో బిగ్ అచీవ్‌మెంట్!
ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కూడా ఒక నటుడి లేదా నటి బ్రాండ్ వాల్యూని డిసైడ్ చేసే కీలక అంశంగా మారుతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 22 July 2026 5:48 PM ISTభారతీయ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా స్టార్‌డమ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆ గుర్తింపు కేవలం బాక్సాఫీస్ సక్సెస్‌లు, భారీ కలెక్షన్లకే పరిమితం కావడం లేదు. ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కూడా ఒక నటుడి లేదా నటి బ్రాండ్ వాల్యూని డిసైడ్ చేసే కీలక అంశంగా మారుతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లో రష్మిక మందన్నా పేరు ప్రత్యేకంగా నిలుస్తోంది. సౌత్ సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె, ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటిగా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ స్టేజ్‌లపై కూడా భారతీయ ప్రతినిధిగా నిలిచే అవకాశాలను అందుకుంటుండటం విశేషం.
తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేయడం ద్వారా రష్మిక విస్తృత ప్రేక్షకాదరణను సంపాదించారు. భాషల మధ్య ఉన్న గీతలను చెరిపేస్తూ ప్రతి ప్రాంత ప్రేక్షకులతో అనుబంధాన్ని పెంచుకోవడం ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులు, ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యాలు, దేశవ్యాప్తంగా పెరిగిన గుర్తింపు ఆమెను కేవలం సినీ నటిగానే కాకుండా ఒక స్ట్రాంగ్ గ్లోబల్ బ్రాండ్‌గా నిలబెట్టింది. ఇదే కారణంగా వినోదరంగానికి అతీతంగా దేశ ప్రతిష్ఠను ప్రతిబింబించే కార్యక్రమాలకు కూడా ఆమె పేరు పరిశీలనలోకి వస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
అందుకు తాజా ఉదాహరణగా కామన్‌వెల్త్ గేమ్స్ క్లోజింగ్ వేడుకల్లో భారత సాంస్కృతిక ప్రదర్శనలో రష్మిక పాల్గొననున్నట్లు వస్తున్న సమాచారం నిలుస్తోంది. ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్‌తో కలిసి భారతీయ కళా వైభవాన్ని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రత్యేక కార్యక్రమంలో ఆమె భాగస్వామ్యం కానున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలో చోటు దక్కడం, రష్మిక కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా భావించవచ్చు. సినిమా సక్సెస్‌లకు అతీతంగా దేశ సాంస్కృతిక ప్రతినిధిగా గుర్తింపు పొందడం, ఆమె బ్రాండ్ పరిధి ఎంత విస్తరించిందో చెప్పే సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రష్మిక ఎదుగుదల వెనుక మరో ముఖ్యమైన అంశం ఆమె ఇమేజ్. కెరీర్‌లో సహజంగానే కొన్ని విమర్శలు ఎదురైనా, పెద్ద వివాదాలకు దూరంగా ఉండటం, అన్ని భాషల ప్రేక్షకులతో సమానంగా మమేకం కావడం, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు విస్తృత ఆదరణను పొందడం ఆమెకు పెద్ద బలంగా మారాయి. పలు భాషల్లో రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ ప్రతి మార్కెట్‌లో తన ఉనికిని నిలబెట్టుకోవడం కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై భారతీయ ముఖచిత్రంగా రష్మికకు అవకాశాలు పెరగడం యాదృచ్ఛికం కాదని, మారుతున్న భారత సినీ పరిశ్రమలో గ్లోబల్ బ్రాండ్‌గా ఆమె స్థానం మరింత బలపడుతున్నదనే సంకేతంగా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
