రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్' పజిల్.. హోస్ట్ ఎవరబ్బా?
పుష్ప, చావా సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులున్నాయి.
By: M Prashanth | 18 Oct 2025 6:39 PM ISTపుష్ప, చావా సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులున్నాయి. అయితే, ఆమె ఒప్పుకున్న సినిమాల్లో ఒకటైన 'ది గర్ల్‌ఫ్రెండ్' గురించి మాత్రం చాలా కాలంగా ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో ఈ సినిమా అసలు ఉందా లేదా ఆగిపోయిందా? అని అభిమానుల్లో, సినీ వర్గాల్లో రకరకాల చర్చలు జరిగాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
అయితే, సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన సినిమా ఆగిపోయినట్లు కాదంటూ 'ది గర్ల్‌ఫ్రెండ్' టీమ్ ఒక్కసారిగా ప్రమోషన్ల సునామీని ప్రారంభించింది. దీపావళి పండగ మూడ్‌ను కంటిన్యూ చేస్తూ, సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నాళ్లుగా ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, ప్రమోషన్ల హడావుడిని గ్రాండ్‌గా మొదలుపెట్టింది.
అసలు విషయానికొస్తే, ఈ సినిమాను నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. త్వరలోనే అది రిలీజ్ కానుంది. ఇందులో రష్మిక, హీరో దీక్షిత్ శెట్టి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు.
అయితే ఇక్కడే చిత్రయూనిట్ ప్రేక్షకులకు, అభిమానులకు ఓ చిన్న పజిల్ ఇచ్చింది. "ఈ క్రేజీ ఇంటర్వ్యూకి హోస్ట్ ఎవరో గెస్ చేయండి?" అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆ హోస్ట్ ఎవరై ఉంటారా అని రకరకాల పేర్లను కామెంట్ చేస్తూ, ఈ అప్‌డేట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఒక్క పోస్ట్‌తో సినిమాపై మళ్లీ బజ్ క్రియేట్ చేయడంలో టీమ్ సక్సెస్ అయింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రాబోతోంది. విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. మొత్తం మీద, ఒక్క అనౌన్స్‌మెంట్‌తో 'ది గర్ల్‌ఫ్రెండ్' టీమ్ సినిమాపై ఉన్న నెగిటివ్ టాక్‌కు చెక్ పెట్టింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో కోసం, సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ అందమైన ప్రేమకథ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో తెలియాలంటే నవంబర్ 7 వరకు ఆగాల్సిందే.
