Begin typing your search above and press return to search.

గ‌ర్ల్‌ఫ్రెండ్ మ‌రో చి.ల‌.సౌ అవుతుందా?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా లీడ్ రోల్ లో న‌టించిన తాజా సినిమా ది గ‌ర్ల్ ఫ్రెండ్.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Nov 2025 5:00 AM IST
గ‌ర్ల్‌ఫ్రెండ్ మ‌రో చి.ల‌.సౌ అవుతుందా?
X

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా లీడ్ రోల్ లో న‌టించిన తాజా సినిమా ది గ‌ర్ల్ ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి హీరోగా న‌టించిన ఈ సినిమాను అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ధీర‌జ్ మెగిలినేని, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ది గర్ల్ ఫ్రెండ్ నవంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. టాలీవుడ్ న‌టుడు, డైరెక్ట‌ర్ రాహుల్ రవీంద్ర‌న్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

చి.ల‌.సౌ తో డైరెక్ట‌ర్ గా మారిన రాహుల్

న‌టుడిగా రాహుల్ మంచి పెర్ఫార్మ‌ర్ అని అంద‌రికీ తెలుసు. అప్ప‌టివ‌ర‌కు న‌టుడిగా ఉన్న రాహుల్ ఉన్న‌ట్టుండి మెగా ఫోన్ ప‌ట్టి సుశాంత్ హీరోగా చి.ల‌.సౌ అనే సెన్సిటివ్ సినిమాను తీసి అంద‌రినీ ఆ సినిమాతో ఆక‌ట్టుకున్నారు. చి.ల‌.సౌ తో రాహుల్ లో మంచి డైరెక్ట‌ర్ ఉన్నాడ‌ని అంద‌రూ భావించారు. అంద‌రిలానే అనుకున్న కింగ్ నాగార్జున రాహుల్ కు ఓ ఛాన్స్ ఇచ్చారు.

మ‌న్మ‌థుడు2తో డిజాస్ట‌ర్

రాహుల్ కు ఛాన్స్ ఇవ్వ‌డ‌మే కాకుండా అత‌ని ద‌ర్శ‌క‌త్వంలో చేసే సినిమాకు మ‌న్మ‌థుడు2 అనే టైటిల్ ను ఇచ్చి డైరెక్ట‌ర్ గా రాహుల్ ను నెక్ట్స్ పొజిష‌న్ కు తీసుకెళ్దామ‌నుకుంటే ఆ సినిమా అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ డిజాస్ట‌ర్ గా నిలిచింది. మ‌న్మ‌థుడు2 ఫ్లాప‌వ‌డంతో రాహుల్ ఆ త‌ర్వాత వెంట‌నే సినిమా చేయ‌లేదు. ఎంతో టైమ్ తీసుకుని ఓ క‌థ‌ను రాసుకుని స్క్రిప్ట్ ను డెవ‌ల‌ప్ చేసుకుని దాన్ని ర‌ష్మిక‌కు చెప్పి ఒప్పించి గ‌ర్ల్ ఫ్రెండ్ ను ప‌ట్టాలెక్కించారు.

ర‌ష్మిక కు కూడా ఈ క‌థ బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే గ‌ర్ల్ ఫ్రెండ్ కు ఓకే చెప్పారు. ఆల్రెడీ గ‌ర్ల్ ఫ్రెండ్ నుంచి వ‌చ్చిన కంటెంట్ కు ఆడియ‌న్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగా, ఈ మూవీ గురించి ఇప్పుడో కొత్త విష‌యం తెలుస్తోంది. ది గ‌ర్ల్ ఫ్రెండ్ లో ర‌హుల్ ఓ మంచి పాయింట్ ను ట‌చ్ చేశార‌ని, ఆ పాయింట్ కు అమ్మాయిలు బాగా క‌నెక్ట్ అవుతార‌ని, సినిమాలో ర‌ష్మిక క్యారెక్ట‌ర్, యాక్టింగ్, క్లైమాక్స్ గురించి కొంత కాలం పాటూ మాట్లాడుకుంటార‌ని అంటున్నారు. ఇవ‌న్నీ వింటుంటే రాహుల్ నుంచి మ‌రో చి.ల‌.సౌ లాంటి సినిమా వ‌స్తుందా అనిపిస్తోంది.