సోలో రిలీజ్ రష్మిక మూవీకి కలిసి వచ్చేనా..?
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న రష్మిక మందన్న మరో వైపు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తోంది.
By: Ramesh Palla | 8 Sept 2025 10:00 PM ISTటాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న రష్మిక మందన్న మరో వైపు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తోంది. 2022లో 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన రష్మిక మందన్న ఆ సినిమాతో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌తో హిందీలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంది. 2023లో మిషన్ మజ్ను సినిమాతో వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా రణబీర్ కపూర్ హీరోగా తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. యానిమల్ సినిమా దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో పాటు, రష్మికకి మంచి స్టార్‌డం తెచ్చి పెట్టింది.
సికిందర్‌తో రష్మిక మందన్న ఫ్లాప్..
యానిమల్ తర్వాత బాలీవుడ్ నుంచి మరిన్ని సినిమా ఆఫర్లు వస్తున్నాయి. రష్మిక ఒప్పుకోవాలే కానీ ఏడాదికి రెండు మూడు బాలీవుడ్ సినిమాలను చేసే అవకాశాలు వచ్చాయట. కానీ రష్మిక మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చింది. ఛావా సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను బాలీవుడ్‌లో అందుకున్న రష్మిక మందన్నకి సల్మాన్ ఖాన్ తో నటించిన సికిందర్ సినిమా చాలా పెద్ద నిరాశను మిగిల్చింది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సికిందర్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈమె చేతిలో బాలీవుడ్ మూవీ 'థామ' ఉంది. వచ్చే నెలలో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయమై రష్మిక చాలా నమ్మకంగా కనిపిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
థామాతో రష్మిక మందన్న హిట్ గ్యారెంటీ
టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి, దసరా సీజన్ అత్యంత కీలకమైనది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే ఫ్యామిలీ సినిమాలు ఈజీగా వంద కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్‌లోనూ అదే సెంటిమెంట్ ఉంది. అయితే సంక్రాంతికి కాకుండా హిందీ సినిమాలు దీపావళికి వస్తే భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. బాలీవుడ్ స్టార్స్ లో ఎక్కువ శాతం మంది తమ సినిమాను ఏదో ఒక దీపావళికి తీసుకు రావాలని ఆశ పడుతారు. ప్రతిసారి మాదిరిగానే ఈ సారి కూడా దీపావళికి మూడు నాలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీకి నిలుస్తాయని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల సినిమాలు ఆలస్యం అవుతూ వచ్చి, చివరకు 2025 దీపావళికి కేవలం రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన 'థామ' సినిమా మాత్రమే విడుదల కాబోతుంది.
క్రిస్మస్ కానుకగా ధురంధర్ మూవీ
దీపావళికి వస్తుందని ఆశించిన ధురంధర్ సినిమాను వాయిదా వేశారు. క్రిస్మస్ కానుకగా ఆసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కాంతార చాప్టర్ 1 సినిమాను సైతం 2025 దీపావళికి వస్తుందని అంతా భావించారు. కానీ ధురంధర్ సినిమా మాదిరిగానే కాంతార సినిమా దీపావళి బరిలో నిలవడం లేదు. ఇతర హిందీ సినిమాలు ఏవీ కూడా దీపావళికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో థామ సినిమా సోలో రిలీజ్ కానుంది. రష్మిక మందన్న ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న రష్మిక మందన్నకి థామా సినిమా హిట్ అయితే తప్ప ముందు ముందు రాబోతున్న సినిమాలకు మార్కెట్ క్రియేట్ అయ్యే పరిస్థితి లేదు.
