నా సక్సెస్ సీక్రెట్ అదే - రష్మిక
సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ లేదా ఒక హీరో సక్సెస్ అయ్యారు అంటే వారి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి అభిమానులే కాదు.. తోటి సెలబ్రిటీలు కూడా తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.
By: Madhu Reddy | 4 Dec 2025 12:30 PM ISTసినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ లేదా ఒక హీరో సక్సెస్ అయ్యారు అంటే వారి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి అభిమానులే కాదు.. తోటి సెలబ్రిటీలు కూడా తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే చాలామంది సెలబ్రిటీలు తమ సక్సెస్ సీక్రెట్ బయట పెట్టడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఇక్కడ నేషనల్ క్రష్ రష్మిక మాత్రం తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఈమె చెప్పిన విధానం బట్టి చూస్తే సెలబ్రిటీలు కూడా ఇలాగే ఆలోచిస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ ఎప్పుడూ కలెక్షన్స్ తో కళకళలాడుతుంటుంది అంటూ కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి రష్మిక తన సక్సెస్ సీక్రెట్ గురించి ఏం చెప్పింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది రష్మిక. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. తర్వాత వచ్చిన పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర, థామా, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్ అంటూ వరుసగా సినిమాలు చేసి ఈ చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఒక చిత్రం తర్వాత మరో చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారుగా నాలుగువేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఏ స్టార్ హీరో సాధించని ఘనతను సాధించి రికార్డులు సృష్టించింది. దీంతో రష్మికకి అదృష్టం బాగా కలిసి వచ్చిందని అందరూ అనుకుంటుండగా.. తాజాగా తాను ఈ రేంజ్ లో సక్సెస్ అందుకోవడానికి గల కారణంపై స్పందించింది రష్మిక. వరుస విజయాల గురించి రష్మిక మాట్లాడుతూ.." హద్దులు పెట్టుకోకుండా అన్ని రకాల పాత్రలలో నటించాలని నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం కారణంగానే నేను వైవిధ్యమైన పాత్రలలో నటించగలుగుతున్నాను. ప్రజలు మనల్ని అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అప్పటివరకు ఎదురుచూడక తప్పదు. కానీ చేసే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుడిని మెప్పించగలగాలి. అప్పుడే మనం ఊహించిన సక్సెస్ మన ఇంటి తలుపు తడుతుంది" అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు హద్దులు పెట్టుకొని కొన్ని పాత్రలకే పరిమితమైన హీరోయిన్స్ కి రష్మిక కామెంట్స్ మేలుకొలుపుగా ఉన్నాయి అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఇప్పుడు మైసా , రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.
