అందరి దృష్టి విరోష్ నగల పైనే.. కోడలి కోసం మాధవి ఊహించని బహుమతి!
ఈ అద్భుతమైన ఆభరణాలను రూపొందించడానికి ప్రముఖ 'శ్రీ జ్యువెలర్స్' సంస్థకు దాదాపు 10 నెలల సమయం పట్టిందట.
By: Madhu Reddy | 27 Feb 2026 2:02 PM ISTటాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఉదయ్‌పూర్‌లో నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. వారి వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'విరోష్' జంట ధరించిన రాజసం ఉట్టిపడే నగలపైనే అందరి కళ్లు ఉన్నాయి. అచ్చం రాజుల కాలం నాటి శైలిని తలపించేలా ఉన్న ఆ ఆభరణాలు కేవలం అలంకరణ మాత్రమే కాదు, వాటి వెనుక పది నెలల కష్టం, ఒక తల్లి ప్రేమ కూడా దాగి ఉన్నాయి. ఆ అద్భుతమైన జ్యువెలరీ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
కోడలిపై ప్రేమ.. అత్త మాధవి స్పెషల్ గిఫ్ట్:
ఈ పెళ్లిలో అన్నింటికంటే ప్రత్యేకంగా నిలిచింది విజయ్ దేవరకొండ తల్లి మాధవి తన కోడలికి ఇచ్చిన బహుమతి. తన ఇంటి మహాలక్ష్మిగా అడుగుపెడుతున్న రష్మిక కోసం ఆమె ప్రత్యేకంగా బంగారు గాజులను చేయించి కానుకగా ఇచ్చారు. అత్తగారి నుంచి అందిన ఈ వెలకట్టలేని బహుమతిని ధరించి రష్మిక మురిసిపోయింది. తొమ్మిది గజాల ఎరుపు రంగు పట్టుచీరలో, అత్తమ్మ ఇచ్చిన గాజులతో రష్మిక అచ్చం ఒక దేవతలా మెరిసిపోయింది. కేవలం నగలే కాదు, ఆ కుటుంబం రష్మికను ఎంత ప్రేమగా ఆహ్వానించిందో ఈ గిఫ్ట్ చెప్పకనే చెబుతోంది.
10 నెలల శ్రమ.. రాజసం ఉట్టిపడే నక్షీ వర్క్:
రష్మిక ధరించిన నగలు చూస్తుంటే ఏదో కోటలోని రాణిని చూస్తున్నట్టుగా ఉంది కదూ.. ఈ అద్భుతమైన ఆభరణాలను రూపొందించడానికి ప్రముఖ 'శ్రీ జ్యువెలర్స్' సంస్థకు దాదాపు 10 నెలల సమయం పట్టిందట. దక్షిణ భారత దేశ నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా, యాంటిక్ మ్యాట్ ఫినిషింగ్‌తో వీటిని తయారు చేశారు. లోతైన నక్షీ పనితనం, సన్నని రవ్వ డిటైలింగ్‌తో కూడిన 11 రకాల ఆభరణాలను రష్మిక ధరించింది. సాంప్రదాయ చోకర్లు, భారీ హారాలు ఆమెకు ఒక రాయల్ లుక్‌ను ఇచ్చాయి. ఈ నగలు కేవలం బంగారం మాత్రమే కాదు, మన సంస్కృతికి నిదర్శనంగా నిలిచాయి.
పట్టు పంచెలో విజయ్.. పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ వెడ్డింగ్:
ఇక ఒకవైపు రష్మిక నగలు టాక్ ఆఫ్ ది టౌన్ అయితే, మరోవైపు విజయ్ దేవరకొండ తన ట్రెడిషనల్ పట్టు పంచెలో, ఐవరీ కలర్ కుర్తాలో ఎంతో హుందాగా కనిపించాడు. ఇక పెళ్లిలో ఫోన్లకు అనుమతి లేకపోయినా, వారు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా అనిపిస్తోంది. కేవలం కొంతమంది సన్నిహితుల మధ్య, ఎంతో ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుకలో విజయ్ కూడా తన శైలికి తగ్గట్టుగా క్లాసిక్ నగలను ధరించాడు. వీరిద్దరి జంట చూస్తుంటే 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనే మాటకు నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తున్నారు.
