తెలంగాణ కోడలిని అంటూ నేషనల్ క్రష్ సగర్వంగా!
'నేను తెలంగాణ కోడలిని. తెలంగాణ ఇంటి ఆడపడుచునని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను' అని సంతోషంగా ప్రకటించారు.
By: Srikanth Kontham | 19 Oct 2026 4:02 PM ISTపాన్ ఇండియా లో స్టార్ హీరోయిన్గా వెలిగిపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వినయంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉండే కథానాయికల్లో ఒకరిగా ఉన్నా? సాంప్రదాయాలకు, స్థానిక సంస్కృతికి రష్మిక ఇచ్చే గౌరవం అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకల్లో రష్మిక పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
స్థానిక తెలంగాణ మహిళలతో కలసి రష్మిక ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడటం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి.. ఆనందానికి గురిచేసింది. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సామాన్య మహిళలతో కలిసి పాటలు పాడుతూ అడుగులు వేస్తూ వేడుకలను జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఒక స్టార్ హీరోయిన్ ఇలా వీధిలో అందరితో కలిసిపోవడం, స్థానిక పండుగలో పాలుపంచుకోవడం ఆమెలోని ఎంతో సింపుల్ స్వభావాన్ని ఆవిష్కరించింది.
ఈ వేడుకల సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. `నేను తెలంగాణ కోడలిని. తెలంగాణ ఇంటి ఆడపడుచునని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను` అని సంతోషంగా ప్రకటించారు. ఇక్కడి ప్రజలు చూపించే ఆప్యాయత, ప్రేమ తనకు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ నేలతో తనకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిదని భావోద్వేగంతో వెల్లడించారు. ఈ మాటలు విన్న తెలంగాణ ప్రజలు, అభిమానులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
రష్మిక ఇంత సరళంగా.. సంస్కారవంతంగా ఉండటం చూసి విజయ్ దేవరకొండ నిజంగా ఎంతో లక్కీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కుటుంబంతో.. ఆయన మూలాలతో రష్మికకు ఉన్న అనుబంధం గురించి ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఆసక్తికరమైన చర్చలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక తెలంగాణ సంస్కృతిని తన సొంత సంస్కృతిగా భావించి ఇంత గౌరవంగా బతుకమ్మ ఆడటం వారి బంధానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో చాలామంది స్టార్లు తమ చుట్టూ ఒక ప్రత్యేకమైన సరిహద్దులను ఏర్పరచుకుని సామాన్యులకు దూరంగా ఉంటారు. కానీ రష్మిక మాత్రం తన వద్దకు వచ్చే అభిమానులతో, సామాన్య ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మెలుగుతూ ఉంటారు. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నా? భారతీయ మూలాలను మర్చిపోకుండా ఇలా సాంప్రదాయ వేడుకలకు ప్రాధాన్యత ఇవ్వడం రష్మిక ప్రత్యేకతను చాటిచెబుతోంది.
మొత్తానికి బతుకమ్మ పండుగ సందర్భంగా రష్మిక చూపించిన ఆప్యాయత, సింప్లిసిటీ తెలంగాణ మహిళల మనసులను దోచుకున్నాయి. తెలంగాణ సాంప్రదాయాన్ని ఇంత గొప్పగా గౌరవిస్తూ తెలంగాణ కోడలిని అని గర్వంగా ప్రకటించిన రష్మికకు స్థానిక ప్రజలు... అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.
