అమాయకపు రష్మికను రాములమ్మగా మార్చేసారా? వందేమాతరం ఆశ్చర్యం!
‘మైసా’ నుంచి రష్మిక మందన్న నటించిన ‘ఓసేయ్ రాములమ్మ’ రీక్రియేటెడ్ సాంగ్ విడుదలైంది. విజయశాంతికి ఈ పాటను నివాళిగా అంకితం చేస్తున్నట్లు రష్మిక తెలిపారు. ఒరిజినల్ పాట స్థాయిని అందుకోవడం సవాలేనని పేర్కొన్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం, వందేమాతరం శ్రీనివాస్ గాత్రం ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం నవంబర్ 27న విడుదల కానుంది.
By: Sivaji Kontham | 20 Nov 2026 11:28 PM ISTరష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ `మైసా` ప్రమోషన్లు జోరందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఐకానిక్ సాంగ్ `ఓసేయ్ రాములమ్మ` రీక్రియేటెడ్ వెర్షన్‌ను హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ ఎనర్జిటిక్ సంగీతానికి వందేమాతరం శ్రీనివాస్ గాత్రం తోడవడంతో ఈ పాట విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత జ్ఞాపకాలను.. నేటి తరం మాస్ ఎలిమెంట్స్‌ను కలగలిపి రూపొందించిన ఈ పాట సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
`మైసా` గురించి మాట్లాడుతూ దర్శకుడు రవి `ఓసేయ్ రాములమ్మ` పాటను రీక్రియేట్ చేస్తున్నామని చెప్పినప్పుడే తనలో భయం మొదలైందని రష్మిక నిజాయితీగా ఒప్పుకున్నారు. ఒరిజినల్ పాట స్థాయిని అందుకోవడం అసాధ్యమని.. కానీ ఆ స్ఫూర్తికి న్యాయం చేయాలన్నదే తమ ప్రయత్నమని తెలిపారు. ముఖ్యంగా వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడటానికి అంగీకరించడంతో చిత్ర బృందానికి పెద్ద కొండంత బలం వచ్చినట్లయిందని రష్మిక సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాటలను గుర్తుచేసుకుంటూ..ఆయన ఇచ్చిన ఎలివేషన్లకు తనకు లోపల కంగారు పుట్టిందని.. సినిమా విడుదలయ్యాక ఆయన మాటలను నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నట్లు రష్మిక సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ఈ పాటను ఒక చిన్న నివాళిగా అర్పిస్తున్నట్లు ప్రకటించారు. 1997లోనే `ఓసేయ్ రాములమ్మ` వంటి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌తో చరిత్ర సృష్టించారని కొనియాడుతూ.. ఒరిజినల్‌కు ఇచ్చినంత ప్రేమ కాకపోయినా కొంత ప్రేమనైనా తమ ప్రయత్నానికి అందించాలని ప్రేక్షకులను కోరారు.
మరోవైపు ఈ పాట ప్రమోషన్ కోసం రష్మిక తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ కింద అభిమానుల సందడి మామూలుగా లేదు. గోండు గిరిజన యువతిగా రష్మిక పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్ చూసి గూస్‌బంప్స్ పుట్టుకొస్తున్నాయని.. ఇది అసలైన ఫైర్ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మహిళా శక్తిని.. ఆవేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసిస్తూనే.. రొటీన్ పాత్రలకు భిన్నంగా ఇలాంటి ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటున్నందుకు రష్మికను ఫ్యాన్స్ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అయితే రష్మిక లాంటి అమాయకంగా కనిపించే అమ్మాయిని ఇలా రాములమ్మగా చూపించాలనే ఆలోచన మేకర్స్ కి ఎలా వచ్చింది? అంటూ వందేమాతరం శ్రీనివాస్ ఇదే వేదికపై ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
నవంబర్ 27న `మైసా` ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన `ఓసేయ్ రాములమ్మ` పాట ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది. విజయశాంతిని రాములమ్మగా చూసి సర్ ప్రైజ్ అయిన ఆడియెన్ ఇప్పుడు రష్మికను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారా? అన్నది చూడాలి. ఒసేయ్ రాములమ్మ గీతం మైసాకు కలిసొస్తుందనే భావిద్దాం.
హైదరాబాద్ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది:
సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో రష్మిక హైదరాబాద్ ట్రాఫిక్ కారణంగా వేడుకకు ఆలస్యంగా వచ్చినందుకు అభిమానులకు, మీడియాకు క్షమాపణలు చెప్పారు. అంతేకాదు హైదరాబాద్ ట్రాఫిక్ అంతకంతకు పెరిగిపోతుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఓపిగ్గా వేచి చూసిన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
