Begin typing your search above and press return to search.

ట్రైలర్ ఒక మంచి K-డ్రామా రోమ్‌కామ్ వైబ్‌లో ఉంది: ర‌ష్మిక‌

ప్రస్తుతం తరం ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్ కొరియన్ డ్రామాస్ లోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు.

By:  Sivaji Kontham   |   5 Sept 2026 9:22 AM IST
ట్రైలర్ ఒక మంచి K-డ్రామా రోమ్‌కామ్ వైబ్‌లో ఉంది: ర‌ష్మిక‌
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన `ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్` సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవలే కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నటి రష్మిక మందన్న ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు తన మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రష్మిక ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుందని.. తెలుగు చిత్రసీమలో ఇటువంటి వైవిధ్య‌మైన‌ ప్రయత్నాలు చేయ‌డం అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రస్తుతం తరం ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్ కొరియన్ డ్రామాస్ లోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ఇదే విషయాన్ని రష్మిక విశ్లేషిస్తూ, ``నేను కే-డ్రామాలు చూస్తున్నప్పుడు అందరూ ఎందుకు అంతగా చూస్తున్నావని అడిగేవారు. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక మంచి కే-డ్రామా లేదా రోమ్‌కామ్ వైబ్ కనిపిస్తోంది`` అని వ్యాఖ్యానించారు. కంటెంట్ పరంగా సరికొత్త అనుభూతిని అందిస్తూ.. యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో కూడిన రొమాంటిక్ కామెడీలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.

నటుడు ఆనంద్ దేవరకొండతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ వేదికపై రష్మిక గుర్తు చేసుకున్నారు. తాను హైదరాబాద్‌లో `రణబలి` షూటింగ్‌లో ఉన్న సమయంలో ఆనంద్ కేవలం ఒక్క మెసేజ్ చేసి ఈవెంట్‌కు ఆహ్వానించగానే వచ్చానని చెప్పారు. ఆనంద్ చాలా హార్డ్‌వర్కింగ్, స్మార్ట్ అని ప్రశంసిస్తూ... ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడే తీరు తనను ఎంతగానో ఆకట్టుకుంటుందని.. అత‌డి ప్రతి ప్రయత్నం విజయం సాధించాలని ఆకాంక్షించారు.

అలాగే కథానాయిక వైష్ణవి చైతన్య నటనను రష్మిక ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఈ సినిమాలో మహిళా ప్రాధాన్యత కలిగిన ఒక బలమైన క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని ఆనంద్ తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. స్క్రీన్‌పై వైష్ణవి కనబరిచే శక్తి, ప్రతిభ అద్భుతమని.. ఈ పాత్రలో త‌ను కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా 90ల‌లో వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య, సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్‌లతో పాటు మిగతా చిత్ర బృందానికి కూడా తన శుభాకాంక్షలు అందించారు.

పిక్ (EPIC) సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా.. సెప్టెంబర్ 10నే ప్రత్యేక ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారని మేక‌ర్స్ ప్రకటించారు. చిత్రయూనిట్, నటీనటులతో కలిసి తాను కూడా థియేటర్‌లో ఈ సినిమాను చూడబోతున్నానని రష్మిక ఉత్సాహంగా వెల్లడించారు. సరైన రోమ్‌కామ్ కథనంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.