రష్మిక కొత్త లుక్.. ఆ జాగ్రత్తే కలిసొస్తుందేమో..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నను చూస్తే ఇప్పటివరకు గ్లామర్.. క్యూట్ నెస్.. మోడ్రన్ స్టైల్ గుర్తొచ్చేవి.
By: M Prashanth | 5 Oct 2026 12:50 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్నను చూస్తే ఇప్పటివరకు గ్లామర్.. క్యూట్ నెస్.. మోడ్రన్ స్టైల్ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం సుబ్బులక్ష్మి గుర్తొస్తున్నారు! ఒక్క చీర మార్చుకోవడంతో వచ్చిన లుక్ కాదు ఇది.. రోల్ కోసం ఆమె తీసుకుంటున్న ప్రతి చిన్న జాగ్రత్త వల్లనే. కొన్ని రోజుల క్రితం కనిపించిన ఆ లుక్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక రాయల్ బ్లూ పట్టుచీరలో కనిపించిన తీరు నిజంగానే స్పెషల్ గా ఉంది. బంగారు, గులాబీ రంగు బోర్డర్ తో ఉన్న పట్టుచీరకు ట్రెడిషనల్ జ్యువెలరీ, కాసుల పేరు, జుమ్కాలు, ముక్కుపుడక, మల్లెపూలు యాడ్ చేశారు. స్టార్ హీరోయిన్ లా కాకుండా.. పాతకాలం నాటి సంగీత విద్వాంసురాలిలా కనిపించేలా ఆ లుక్ ను డిజైన్ చేశారు. అందులో నీలి రంగు చీర మరింత స్పెషల్ గా నిలిచింది.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి స్టైల్ లో నీలి రంగు చీరలకు ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఆ లుక్ ను ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముక్కుపుడక, వెనక్కి చక్కగా వేసిన కొప్పు, మల్లెపూలు కూడా ఆమె ఐకానిక్ స్టైల్ ను గుర్తుచేస్తున్నాయి. ఆ ఈవెంట్ జరిగి కొన్ని రోజులు అవుతున్నా.. ఇప్పుడు రష్మిక, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ లుక్ పై హైప్ పెరిగింది.
ముఖ్యంగా ఫొటోల్లో కనిపిస్తున్న లుక్ డీటెయిల్స్‌ను గమనిస్తున్న కొద్దీ.. మేకోవర్ వెనుక ఎంత కేర్ తీసుకున్నారో అర్థమవుతోంది. అయితే రష్మికకు సంబంధించిన మరో లుక్ కూడా అప్పటికే అందరి దృష్టినీ ఆకర్షించింది. లాంఛ్ తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడు ఆమె డార్క్ మెరూన్ చెక్స్ పట్టుచీరలో కనిపించారు. చిన్న కమ్మలు, ముక్కుపుడక, పెద్ద కుంకుమ బొట్టుతో సింపుల్ గా ఉన్నారు. భారీ నగలు లేకుండా.. ఒక సాధారణ, పద్ధతైన భారతీయ మహిళలా కనిపించడం లుక్ లో హైలైట్.
ముఖ్యంగా సుబ్బులక్ష్మి కుటుంబ సభ్యుల బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న సమయంలో రష్మిక చూపించిన వినయం మరింత నేచురాలిటీని తీసుకొచ్చింది. ఒక లుక్ లో గ్రాండ్ గా కనిపిస్తే.. మరో లుక్ లో చాలా కూల్ గా, ట్రెడిషనల్ గా కనిపించారు. ఆ రెండు లుక్స్ చూస్తే సుబ్బులక్ష్మి రోల్ ను కేవలం స్క్రీన్ పై చేయడం కాదు.. ఆ పాత్రలోకి వెళ్లేందుకు రష్మిక ముందుగానే తనను తాను మార్చుకుంటున్నారని తెలుస్తోంది.
ఆ మేకోవర్ వెనుక కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనతో పాటు చీరకట్టులో మెటిల్డా, హెయిర్ అండ్ మేకప్ కోసం చిసెల్ స్టూడియోస్ టీమ్ పనిచేసింది. చీర, నగలు, హెయిర్ స్టైల్.. ఇలా ప్రతి అంశాన్ని పాత్రకు తగ్గట్టుగా ఎంచుకున్నారు. నేచురాలిటీ కోసం రష్మిక కర్ణాటక సంగీతంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అంటే బయట కనిపించే లుక్ నుంచి.. పాత్రకు అవసరమైన మ్యూజిక్ వరకు ప్రిపరేషన్ సాగుతోంది. ఏదేమైనా ఆ జాగ్రత్తలే రష్మికకు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి.
