Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ మించి కీర్తిని గ‌డించేలా ర‌ష్మిక‌!

సాధారణంగా గ్లామర్ -బబ్లీ పాత్రలతో అలరిస్తున్న ర‌ష్మిక‌ డివైన్ - క్లాసికల్ రోల్‌లో నటిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది.

By:  Srikanth Kontham   |   25 Jun 2026 5:00 AM IST
కీర్తి సురేష్ మించి కీర్తిని గ‌డించేలా ర‌ష్మిక‌!
X

బయోపిక్‌లు ఎల్లప్పుడూ ప్ర‌త్యేక‌మే. లెజెండరీ వ్యక్తుల జీవితాలను వెండితెరపై పునఃసృష్టి చేయడం నటీనటులకు అతిపెద్ద సవాలుతో కూడుకున్న పని. టాలీవుడ్‌లో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కిన `మహానటి` చిత్రం ఎలాంటి సంచలనం సృష్టించిందో ? తెలిసిందే. ఆ పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేష్ రాత్రికి రాత్రే అపారమైన కీర్తిని గడించింది. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా అలాంటి చారిత్రాత్మక పాత్రలో నటించబోతుందనే వార్త ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

`మహానటి` చిత్రంలో సావిత్రి పాత్రను పోషించడం అనేది కీర్తి సురేష్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయింది. ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం కీర్తి పడిన శ్రమ, చూపించిన హావభావాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సినిమా తెచ్చిపెట్టిన విజయంతో ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించడమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో గౌరవం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే బయోపిక్‌లలో నటించే హీరోయిన్లకు కీర్తి సురేష్ నటన .. వచ్చిన గుర్తింపు ఒక బెంచ్‌మార్క్‌గా మారిపోయాయి.

తాజాగా అదే తరహా అరుదైన అవకాశం రష్మిక మందన్నాను వరించబోతోందని సమాచారం. భారతరత్న దక్కించుకున్న తొలి గాయని అయిన ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా భారీ బయోపిక్ ప్లాన్ జరుగుతోందని అందులో లీడ్ రోల్ కోసం రష్మిక పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. `పుష్ప`, `యానిమల్` వంటి చిత్రాల విజయాలతో పాన్-ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది ర‌ష్మిక‌. `ఛావా` విజ‌యంతోనూ అమ్మ‌డు అంతే ఫేమ‌స్ అయింది.

సాధారణంగా గ్లామర్ -బబ్లీ పాత్రలతో అలరిస్తున్న ర‌ష్మిక‌ డివైన్ - క్లాసికల్ రోల్‌లో నటిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది. సావిత్రి పాత్రతో పోలిస్తే ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రను పండించడం మరింత క్లిష్టం. ఎందుకంటే సుబ్బలక్ష్మి కళాకారిణి మాత్రమే కాదు. భక్తి , ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన వ్యక్తి. ఆమె శారీరక భాషను, శాస్త్రీయ సంగీత గాన ఉచ్ఛారణను, ముఖ వర్చస్సును వెండితెరపై ప్రదర్శించడం ఏ న‌టికైనా అగ్నిపరీక్ష లాంటిదే. పాత్ర కోసం ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే రష్మిక కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సవాలును ఎదుర్కొబోతోందని చెప్పొచ్చు.

రష్మిక ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగితే సాధించే కీర్తి ఖచ్చితంగా కీర్తి సురేష్ సాధించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి కి ఉన్న అంతర్జాతీయ ఖ్యాతి..రష్మికకు ఉన్న వైడ్ పాన్-ఇండియా మార్కెట్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కీర్తి సురేష్ సౌత్ లెవెల్లో `మహానటి`గా నిలిస్తే, రష్మిక సుబ్బ‌ల‌క్ష్మి బ‌యోపిక్ సక్సెస్‌తో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో నటిగా అత్యున్నత శిఖరాన్ని చేరుకోవడం ఖాయం.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. రష్మిక మందన్నాను ఇలాంటి ఐకానిక్ పాత్రలో ఊహించుకోవడం అభిమానులకు సరికొత్త జోష్ ఇస్తోంది. గ్లామర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి తనలోని నటన ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడానికి రష్మికకు ఇదొక సువర్ణావకాశం. మరి ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా సాగుతున్న ఈ ప్రచారం త్వరలోనే అధికారికంగా నిజమవ్వాల‌ని ఆశీద్దాం.