Begin typing your search above and press return to search.

8 ఏళ్ల కెరీర్ 30 ఏళ్ల వ‌య‌సులో జ‌న్మ‌ధ‌న్య‌మ‌య్యే పాత్ర‌లో!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినీ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది.

By:  Srikanth Kontham   |   15 Sept 2026 12:58 PM IST
8 ఏళ్ల కెరీర్ 30 ఏళ్ల వ‌య‌సులో జ‌న్మ‌ధ‌న్య‌మ‌య్యే పాత్ర‌లో!
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినీ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. 8 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ..సరిగ్గా 30 ఏళ్ల వయసులో నటిగా జన్మ ధన్యమయ్యే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాత్రను ఆమె సొంతం చేసుకుంది. కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న శ్రీమతి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో రష్మిక ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న ఈ వార్తపై అధికారిక ప్రకటన రావడంతో సినీ ప్రియులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





ఈ సంచలనాత్మక ప్రాజెక్ట్‌కు `ఎం.ఎస్. – ఏ లెగసీ ఆన్ స్క్రీన్` అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. స్వరకోకిల ఎం.ఎస్. సుబ్బలక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 16న చెన్నై మహానగరంలో ఈ చిత్రాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. దేశం గర్వించదగ్గ సంగీత దిగ్గజం బయోపిక్ కావడం, అందులోనూ కోలీవుడ్ విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో ఈ మూవీ లాంచ్ వేడుకపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో ఓ అరుదైన సాంస్కృతిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రఖ్యాత ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్ బృందం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గానం చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన ఐకానిక్ పాటలను ప్రత్యక్షంగా ఆలపించి ఆమెకు సంగీత నివాళి అర్పించనుంది. ఇలాంటి మహోన్నతమైన వాతావరణంలో, సినీ ప్రపంచంలోని అతిరథ మహారథుల సమక్షంలో రష్మిక మందన్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి రూపంలోకి పరకాయ ప్రవేశం చేయబోతోంది.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడంలో దిట్ట అయిన గౌతమ్ ఈ క్లాసిక్ బయోపిక్‌ను ఏ స్థాయిలో మలుస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అలాగే యువ సంగీత తరంగం అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి లాంటి గానకోకిల బయోపిక్‌కు అనిరుధ్ వంటి ఆధునిక స్వరకర్త ఎలాంటి మ్యాజిక్ అందిస్తాడో చూడాలి.

తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో అగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న రష్మికకు ఈ పాత్ర ఒక సవాలుతో కూడుకున్న వరమని చెప్పొచ్చు. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా ఒక చారిత్రాత్మక సంగీత విద్వాంసురాలి హావభావాలను, భక్తి పారవశ్యాన్ని, సంగీత సాధనను తన నటనలో పండించడం ర‌ష్మిక కెరీర్‌కే అతిపెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారనుంది. గ్లామర్ పాత్రల నుంచి సంపూర్ణ నటనకు అద్దం పట్టే పాత్ర వైపు రష్మిక వేసిన అడుగు ప్రశంసనీయం.

తెలుగు చిత్రసీమలోని దిగ్గజ నిర్మాణ సంస్థలు అల్లు అరవింద్ (గీతా ఆర్ట్స్), బన్నీ వాసు , రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. 8 ఏళ్ల అనుభవంతో, 30 ఏళ్ల ప్రాయంలోనే ఇలాంటి ఒక అమూల్యమైన పాత్రను దక్కించుకున్న రష్మిక మందన్న వెండితెరపై ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగా ఏ స్థాయిలో మెప్పిస్తుందో? చూడటానికి సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.