Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌- విజ‌య్ న‌వ దంపతులకు బిగ్ జాక్‌పాట్

రష్మిక - విజయ్ దేవరకొండ ఇటీవ‌లే పెళ్లితో ఓ ఇంటివార‌య్యారు. ఇప్పుడు రష్మిక తండ్రి ఇచ్చిన ఈ `బిగ్ స‌ర్ ప్రైజ్` అల్లుడికి కానుక అని కూడా అభిమానులు భావిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   9 April 2026 10:12 PM IST
ర‌ష్మిక‌- విజ‌య్ న‌వ దంపతులకు బిగ్ జాక్‌పాట్
X

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న రష్మిక మందన్నకు ఈ ఏడాది పుట్టినరోజు అత్యంత ప్రత్యేకంగా నిలిచింది. తన 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా త‌న‌ తండ్రి మదన్ మందన్న ఒక అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చారు. కూతురిపై ఉన్న మమకారంతో అత‌డు ఒక అత్యంత ఖరీదైన విలాసవంతమైన బంగ్లాను రష్మికకు బహుమతిగా అందించారు. తన కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్న రష్మికకు తండ్రి ఇచ్చిన ఈ కానుక అన్నింటికంటే ప్ర‌త్యేక‌మైన‌ది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ కొత్త నివాసానికి ఆయన `సెరినిటీ` అని పేరు పెట్టడం విశేషం. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ఈ పేరుతో ఉన్న బంగ్లాను చూసి రష్మిక ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి తనపై చూపిస్తున్న నిరంతర ప్రేమ త‌న‌ను ఈ స్థాయిలో నిల‌బెట్టింద‌ని తెలిపారు. ఈ కానుకను ఊహించలేదని ఇది తన జీవితంలో ఒక మధుర జ్ఞాపకమని రష్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా వేదికగా రష్మిక ఈ విశేషాలను షేర్ చేయ‌డంతో ప్రస్తుతం ఈ బంగ్లా వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక తన తండ్రి ఇచ్చిన ఈ బహుమతి విష‌యంలో ఎంతటి కృతజ్ఞతతో ఉన్నారో తెలుపుతూ పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తండ్రి గిఫ్ట్ ఇచ్చిన బంగ్లా ఫొటోలు, దాని ఇంటీరియర్ గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా రష్మిక ఎదుగుదలలో త‌న‌ కుటుంబం పోషిస్తున్న పాత్రను అభిమానులు కొనియాడుతున్నారు.

రష్మిక - విజయ్ దేవరకొండ ఇటీవ‌లే పెళ్లితో ఓ ఇంటివార‌య్యారు. ఇప్పుడు రష్మిక తండ్రి ఇచ్చిన ఈ `బిగ్ స‌ర్ ప్రైజ్` అల్లుడికి కానుక అని కూడా అభిమానులు భావిస్తున్నారు. ఈ కొత్త ఇంట్లోనే వారి భవిష్యత్తు ప్రణాళికలు ఉండబోతున్నాయా? అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

నేషనల్ క్రష్ రష్మికకు నిజంగా ఈ పుట్టినరోజు ఒక మర్చిపోలేని తీపి గుర్తును మిగిల్చింది. కెరీర్ పరంగా పుష్ప‌, పుష్ప 2, యానిమ‌ల్ వంటి భారీ చిత్రాలతో పాన్ ఇండియా విజ‌యాల్ని త‌న సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం షాహిద్ క‌పూర్ - కృతి స‌నోన్ తో క‌లిసి `కాక్ టైల్ 2` అనే చిత్రంలో న‌టిస్తోంది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ లో ర‌ష్మిక గ్లామ‌ర్ డోస్ నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వృత్తిగత వ్య‌వ‌హారం ఇలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలో లభించిన తాజా కానుక ఎంతో ఉత్సాహం నింపింది. తన తండ్రి ఇచ్చిన ఈ `సెరినిటీ` బంగ్లాలో రష్మిక మరిన్ని విజయవంతమైన క్షణాలను గడపాలని అభిమానులు కోరుకుంటున్నారు.