Begin typing your search above and press return to search.

జయమ్మ పాత్ర‌నే కాదు టాప్-5 సినిమాల్లో ర‌ష్మిక కోసం రాసి పెట్టేసారు!

భారతీయ చిత్రసీమలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న రష్మిక మందన్న సినీ ప్రయాణాన్ని గమనిస్తే.. కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఈ ప్ర‌తిభావ‌ని కోసమే పుట్టాయేమో అనిపిస్తుంది.

By:  Sivaji Kontham   |   14 Oct 2026 9:26 AM IST
జయమ్మ పాత్ర‌నే కాదు టాప్-5 సినిమాల్లో ర‌ష్మిక కోసం రాసి పెట్టేసారు!
X

భారతీయ చిత్రసీమలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న రష్మిక మందన్న సినీ ప్రయాణాన్ని గమనిస్తే.. కొన్ని ప్రత్యేకమైన పాత్రలు ఈ ప్ర‌తిభావ‌ని కోసమే పుట్టాయేమో అనిపిస్తుంది. ఏదైనా ఒక పాత్ర నటి వద్దకు రావడం వెనుక ఒక అదృష్టం, రాసిపెట్టి ఉండాలి. అలా రష్మిక కెరీర్‌లో నిలిచిపోయిన `టాప్-5` ఐకానిక్ పాత్రలను చూస్తే.. గీత గోవిందం (2018)లో గీత, డియర్ కామ్రేడ్ (2019)లో లిల్లీ, పుష్ప సిరీస్ (2021-2024)లో శ్రీవల్లి, యానిమల్ (2023)లో గీతాంజలి సింగ్, అలాగే `ఛావా` (2025)లో యేసుబాయి భోంసలేగా ర‌ష్మిక‌ పోషించిన పాత్రలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరబోతున్న మరో పవర్‌ఫుల్ రోల్ `రణబాలి`లోని జయమ్మ! ఈ విష‌యంలో ర‌ష్మిక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్-ఇండియా చిత్రం `రణబాలి` విజయదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ వేడుకలో రష్మిక మందన్న మాట్లాడిన మాటలు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. కొన్ని నెలల తర్వాత తెలుగు ప్రేక్షకులను కలవడం చాలా సంతోషంగా ఉందని..జయమ్మ పాత్రపై వస్తున్న రీల్స్, ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. జయమ్మ అనే పాత్ర ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తూ వారి మనస్సుల్లో ఎప్పటికీ ఉండిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ సినిమా చేయాలన్నా అది రాసిపెట్టి ఉండాలని తాను నమ్ముతానని.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం తన అదృష్టమని తెలిపారు.

సినిమా షూటింగ్ సమయంలో చిత్ర బృందం పడిన కష్టాన్ని రష్మిక ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ``రణబాలి సెట్‌లో అందరూ నెలల తరబడి రాత్రింబవళ్లు హార్డ్ వర్క్ చేసేవారు. నేను కేవలం నాలుగు ఐదు రోజుల షెడ్యూల్ కోసం వెళ్లినప్పుడే వారు పడే శ్రమను చూసి భయమేసేది. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతగా కష్టపడిందో చూసిన మొదటి ఆడియెన్‌ను నేనే. ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతారు`` అని రష్మిక తెలిపారు.

విజయ్ దేవరకొండతో తనకున్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ గురించి వివరిస్తూ.. ```నాకు, విజయ్‌కి ఇది చాలా ముఖ్యమైన చిత్రం. మేము గతంలో `గీత గోవిందం`,`డియర్ కామ్రేడ్` వంటి ప్యూర్ లవ్ స్టోరీస్ చేశాం, కానీ `రణబాలి` సాధారణ లవ్ స్టోరీ కాదు. అయితే ఇందులో ఒక అద్భుతమైన లవ్ ట్రాక్ ఉంటుంది. ఈ సినిమా లవ్ స్టోరీ కంటే చాలా చాలా పెద్దది. భవిష్యత్తులో మేము మళ్లీ ఒక పూర్తిస్థాయి లవ్ స్టోరీ సినిమా కూడా చేస్తాం. ర‌ణ‌బాలి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అందుకోబోతోంది`` అని పేర్కొన్నారు.

మైత్రీ సంస్థ తమకు హోమ్ బ్యానర్ లాంటిదని, ఈ నిర్మాణ సంస్థలో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు రష్మిక తెలిపారు. అక్టోబర్ 16న గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ `రణబాలి` బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం ఖాయమని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఎంతో ప్రష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.