కొన్నిసార్లు విన్ అవుతాం.. కొన్నిసార్లు ఫెయిలవుతాం.. రష్మిక స్టన్నింగ్ స్పీచ్..
ఈ విద్యా పురస్కారాల వేడుకలో రష్మిక మాట్లాడుతూ.. జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణమని, ఇందులో ఎప్పుడూ ఒకేలాంటి ఫలితాలు రావని పేర్కొన్నారు.
By: Sivaji Kontham | 14 Jun 2026 1:53 PM IST``జీవితంలో కొన్నిసార్లు విన్ అవుతాం.. కొన్నిసార్లు ఫెయిలవుతాం.. కానీ ప్రతిసారీ నేర్చుకుంటాం. మీ జీవితాలలో మీరు కూడా నేర్చుకుని ఎదగాల``ని ఆకాంక్షించారు రష్మిక మందన్న. `ది దేవరకొండ ఫౌండేషన్` ఆధ్వర్యంలో అచ్చంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి ఎంతో స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను ఎలా స్వీకరించాలో తనదైన శైలిలో వివరిస్తూ విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
ఈ విద్యా పురస్కారాల వేడుకలో రష్మిక మాట్లాడుతూ.. జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణమని, ఇందులో ఎప్పుడూ ఒకేలాంటి ఫలితాలు రావని పేర్కొన్నారు. జీవితంలో మనం చేసే ప్రతి ప్రయత్నంలోనూ కొన్నిసార్లు విజయం సాధిస్తాం.. మరికొన్నిసార్లు ఓటమిని చవిచూస్తాం ... కానీ గెలిచినా, ఓడినా ఏమాత్రం కుంగిపోకుండా ముందడుగు వేయడం చాలా ముఖ్యం అని విద్యార్థులకు హితవు పలికారు. గెలుపోటములు అనేవి తాత్కాలికమేనని.. నిరంతర శ్రమ మాత్రమే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని స్పష్టం చేశారు.
విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకూడదని రష్మిక సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ... ఎన్నో సవాళ్లను దాటుకుని ఈ రోజు మెరిట్ స్కాలర్‌షిప్‌లు సాధించిన 180 మంది విద్యార్థులను రష్మిక పేరుపేరునా అభినందించారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడానికి ఇలాంటి వేదికను అందించిన `ది దేవరకొండ ఫౌండేషన్` ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా కొనియాడారు.
ఈ వేదికపై విద్యార్థుల విజయాల వెనుక వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని రష్మిక గుర్తుచేశారు. ఈ రోజు పురస్కారాలు అందుకున్న పిల్లలు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, తమ తల్లిదండ్రులకు.. గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జీవితంలో ఏ రోజూ నేర్చుకోవడం ఆపకూడదని, ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఒక కొత్త పాఠం నేర్చుకుని ముందుకు సాగాలని రష్మిక మందన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ సహా స్థానిక నాయకులు, పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు పాల్గొన్నారు.
