అంతర్జాతీయ వేదికపై మరోసారి.. అరుదైన ఘనత సాధించిన రష్మిక!
పేరుకే కన్నడ బ్యూటీ.. నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు..
By: Madhu Reddy | 4 April 2026 1:10 PM ISTపేరుకే కన్నడ బ్యూటీ.. నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. అందం అభినయంతో కాదు నటనతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.. నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న ఈమె.. గత మూడు సంవత్సరాలుగా వరుస చిత్రాలతో.. ఊహించని విజయాలతో.. బాక్సాఫీస్ కలెక్షన్స్ తో స్టార్ హీరోల రికార్డులను కూడా బ్రేక్ చేస్తోంది అనడంలో సందేహం లేదు.
అంతర్జాతీయ వేదికపై రెండవసారి..
పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, సికందర్ , ది గర్ల్ ఫ్రెండ్, కుబేర ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ.. బాక్సాఫీస్ క్వీన్ గా పేరు సొంతం చేసుకుంది రష్మిక మందన్న . ఇదిలా ఉండగా అటు కెరియర్ పరంగా బిజీగా మారిన ఈమె.. ఇటు వ్యక్తిగతంగా తన ప్రాణ స్నేహితుడైన విజయ్ దేవరకొండ తో ఏడడుగులు కూడా వేసింది. ఇక ఇప్పుడు వివాహితగా మారిన తర్వాత తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి చేస్తున్న తొలి చిత్రం రణబాలి. ఇప్పటికే ఈ సినిమాలోని రాయలసీమ ప్రాంతానికి సంబంధించి షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. మరొకవైపు మైసా అనే సినిమాలో కూడా నటిస్తోంది రష్మిక . ఇలా కెరియర్ పరంగా వరుస చిత్రాలతో బిజీగా మారిన ఈమె తాజాగా మరోసారి అంతర్జాతీయ వేదికపై కనిపించనుంది. అంతేకాదు ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ సినీ నటిగా పేరు కూడా సొంతం చేసుకుంది రష్మిక.
ఇండియా స్వీట్ హార్ట్ గా రష్మిక..
పూర్తి వివరాల్లోకి వెళితే.. జపాన్ లోని టోక్యోలో మే 23వ తేదీన జరగనున్న " క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026"లో రష్మిక ప్రజెంటర్ గా వ్యవహరించబోతోంది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై ఈమె రెండవసారి కనిపించడం గమనార్హం.. 2024 లోనే ఈమె ఈ అవార్డ్స్ వేడుకల్లో ప్రజెంటర్ గా సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకసారి ఈ అవకాశం అందుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ప్రతిష్టాత్మక వేదికపై వరుసగా రెండుసార్లు అవార్డులు అందజేస్తున్న తొలి భారతీయ నటిగా రష్మిక చరిత్ర సృష్టించింది. పైగా పుష్ప సినిమాతో జపాన్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈమెను క్రంచీరోల్ సంస్థ "ఇండియా స్వీట్ హార్ట్" గా అభివర్ణించింది.
పుష్ప మూవీ తోనే సాధ్యం..
ఇకపోతే ఈ క్రెడిట్ మొత్తం పుష్ప సినిమాకే లభిస్తుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రతో అందరినీ ఆకట్టుకుంది రష్మిక. జపాన్లో ఈ సినిమా విడుదల చేసినప్పుడు శ్రీవల్లి పాత్రకు అక్కడి జపాన్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడి సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి నిర్వహకులు ఈమెను వరుసగా మళ్లీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది . ఏది ఏమైనా భారతీయ నటీమణులు ఇలా గ్లోబల్ స్టార్లుగా ఎదుగుతున్నారు అనడానికి రష్మిక మరో ఉదాహరణగా నిలిచింది అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆస్కార్ వేదికపై ప్రియాంక చోప్రా రెండవసారి కనిపించి సంచలనం సృష్టించింది.
