ఎవరేమనుకున్నా పట్టించుకోను
ప్రముఖ నటి రష్మిక మందన్నా ఇప్పుడు పలు విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 Oct 2025 12:25 PM ISTప్రముఖ నటి రష్మిక మందన్నా ఇప్పుడు పలు విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఇటీవలే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్నారు. రష్మిక బాలీవుడ్ లో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో చేసిన థామా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గత కొంతకాలంగా తనపై వస్తున్న పుకార్లపై రెస్పాండ్ అయ్యారు.
అపార్థాల వల్లే పుకార్లు పుడతాయి
రక్షిత్ శెట్టితో విడిపోయాక కన్నడ చిత్ర పరిశ్రమ తనను నిషేధించిందని కొంత కాలంగా వస్తున్న పుకార్లకు రష్మిక క్లారిటీ ఇచ్చారు. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని, కొన్నిసార్లు అపార్థాల వల్ల ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని తెలిపారు రష్మిక. ఇతరుల కోసం మనం జీవించకూడదని, మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్లాలని రష్మిక అభిప్రాయపడ్డారు.
రీసెంట్ గా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న కాంతార1 సినిమాపై కూడా రష్మిక రెస్పాండ్ అవలేదని ఆమెపై విమర్శలు రాగా, ఆ విషయంలో కూడా రష్మిక క్లారిటీ ఇచ్చారు. ఏ సినిమా అయినా రిలీజైన వెంటనే తాను చూడలేనని, కాంతార కూడా కొన్ని రోజులు ఆగాకే చూశానని, సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెప్తూ మెసేజ్ చేశానని, వాళ్లు కూడా దానికి థ్యాంక్స్ చెప్పారని రష్మిక వెల్లడించారు.
అన్నీ విషయాలు కెమెరా ముందుకు తీసుకురాలేం
అన్నీ విషయాలు అందరికీ తెలియవని, పర్సనల్ లైఫ్ లో జరిగే ప్రతీ విషయాన్ని కెమెరా ముందుకు తీసుకురాలేమని, తాను కూడా అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే పర్సన్‌ను కాదని, అందుకే జనాలు ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోనని, తన యాక్టింగ్ గురించి ఆడియన్స్ ఏం మాట్లాడతారనేదే తనకు ముఖ్యమని, దాన్ని మాత్రమే తాను లెక్కలోకి తీసుకుంటానని రష్మిక స్పష్టం చేశారు. థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కానుండగా, ఆ తర్వాత నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా రష్మిక పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.
