Begin typing your search above and press return to search.

పెళ్ల‌యింద‌నిపించ‌డం లేదు.. ఫ్యాన్ గాళ్‌గానే ఫీల‌వుతున్నా!- ర‌ష్మిక‌

ఈ వేడుకలో రష్మిక మందన్న తన మనసులోని మాటలను షేర్ చేస్తూ.. విజయ్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టారు.

By:  Sivaji Kontham   |   14 Oct 2026 9:26 AM IST
పెళ్ల‌యింద‌నిపించ‌డం లేదు.. ఫ్యాన్ గాళ్‌గానే ఫీల‌వుతున్నా!- ర‌ష్మిక‌
X

టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల జోడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా `రణబాలి` ప్రీ-రిలీజ్ వేడుకలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు చూపించిన ప్రేమ, పరస్పరం పంచుకున్న భావోద్వేగాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వివాహం తర్వాత తొలిసారిగా తెరపై భార్యాభర్తలుగా అలరించబోతున్న ఈ జోడీ... వేదికపై ఒకరినొకరు ప్రేమగా సంబోధించుకున్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రష్మిక తన భర్త విజయ్‌ను ఎంతో ప్రేమగా `విజ్జు` అని పిలవగా, విజయ్ కూడా ఆమెను ముద్దుగా `రాషి` అంటూ సంబోదించడం ఇరువురి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని చాటిచెప్పింది. ఈ స‌మ‌యంలోనే విరోష్ అంటూ అభిమానులు ఈ జంట‌ను ఎంతో ముద్దుగా ఆప్యాయంగా పిలిచేస్తున్నారు.

ఈ వేడుకలో రష్మిక మందన్న తన మనసులోని మాటలను షేర్ చేస్తూ.. విజయ్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టారు. ``పెళ్లయిందంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు.. నేను ఎప్పుడూ మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ గార్ల్‌గానే ఫీలవుతుంటా` అంటూ విజయ్ సమక్షంలో రష్మిక‌ చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా ఏదైనా.. రియల్ లైఫ్ అయినా తన భర్త పడే కష్టాన్ని, ఆయన సాధిస్తున్న విజయాలను చూసి ఒక అభిమానిలా గర్వపడుతుంటానని రష్మిక తెలపడం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.

ఇక రశ్మిక గురించి హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ న‌ట‌నావృత్తిలో త‌న‌ అంకితభావాన్ని ప్రశంసించారు. రశ్మికతో తాను నటిస్తున్న మూడో సినిమా ఇది అని గుర్తుచేసుకుంటూ.. నటిగా - వ్యక్తిగా రాషి ఎంతగానో ఎదిగారని కొనియాడారు. రశ్మిక ఒక రోబోలా నిరంతరం కష్టపడుతుందని.. ఆమె సొంతంగా సంపాదించుకున్న గుర్తింపును చూసి తాను ఎప్పుడూ గర్వపడుతుంటానని తెలిపారు. `రణబాలి` చిత్రంలో రణబాలి, జయమ్మ పాత్రలు సృష్టించే ఇంపాక్ట్‌కు రశ్మిక మాత్రమే పూర్తి న్యాయం చేయగలదని విజయ్ పేర్కొన్నారు.

కో-ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి.. ఆపై జీవిత భాగస్వాములుగా మారిన ఈ జంట ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతోంది. ఒకరి విజయాన్ని మరొకరు ఆహ్వానించడం... కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలవడం ఈ జోడీ ప్రత్యేకత. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు... వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కేవలం ప్రొఫెషనల్ బాండింగే కాకుండా.. పర్సనల్ లైఫ్‌లోనూ ఈ జంట చూపుతున్న అన్యోన్యత అందరినీ ఆకట్టుకుంటోంది.

చివరగా ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న `రణబాలి` సినిమాను థియేటర్లలో చూడాలని ఈ జంట‌ కోరారు. సినిమా విడుదలైన తర్వాత అభిమానులను నేరుగా కలిసేందుకు విజయవాడ - అనంతపురం వెళ్లనున్నట్లు ఈ వేదిక ద్వారా ప్రకటించారు. వివాహం తర్వాత తొలిసారిగా ఈ జోడీ నుంచి వస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.