2025 సూపర్ హిట్.. 2026 సంగతేంటి?
2025.. మిగతా సెలబ్రిటీల మాట ఏమో కానీ రష్మికకి మాత్రం ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె కెరియర్ ను సూపర్ హిట్ గా మార్చేసింది ఈ ఏడాది.
By: Madhu Reddy | 27 Dec 2025 1:00 PM IST2025.. మిగతా సెలబ్రిటీల మాట ఏమో కానీ రష్మికకి మాత్రం ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె కెరియర్ ను సూపర్ హిట్ గా మార్చేసింది ఈ ఏడాది. ఈ ఏడాది మొదట్లోనే బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో ఛావా సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రష్మిక.ఇందులో శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నటించి తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను దోచుకుంది..ముఖ్యంగా ఎలాంటి పాత్రలోనైనా సరే జీవించగలదు అనే నమ్మకాన్ని దర్శక నిర్మాతలకు కలిగించింది ఈ ముద్దుగుమ్మ.
అలాంటి ఈమె ఆ తర్వాత అదే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన సికందర్ అనే సినిమా చేసింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. రష్మిక కెరియర్ పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. పైగా ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించాయి. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ , నాగార్జున కలయికలో వచ్చిన కుబేర సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇకపోతే ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషలో బైలింగ్వల్ గా తెరకెక్కింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత హిందీలో ఈమె నటించిన చిత్రం థామా.. రష్మిక కెరియర్ లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కూడా రష్మిక కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని చేర్చింది. అంతేకాదు తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో భూమా దేవి పాత్రతో అదరగొట్టేసింది రష్మిక. ఇలా ఈ ఏడాది ఏకంగా 5 చిత్రాలతో 5 బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని.. సంచలనం క్రియేట్ చేసింది. అంతేకాదు ఏ హీరోకి సాధ్యం కాని అరుదైన రికార్డులను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా ఈ ఏడాది రష్మికకు సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక ఇదంతా బాగానే ఉన్నా.. మరి 2026 సంగతేంటి? అంటూ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం మైసా. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా.. అనూహ్య స్పందన లభించింది. పోస్టర్ చూస్తుంటేనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతోంది రష్మిక అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి నెటిజన్స్ నుంచి.. అలాగే వచ్చే ఏడాది హిందీలో కాక్టెయిల్ 2 లో కూడా నటిస్తోంది. ఈ రెండు చిత్రాల తర్వాత ఈమె ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇటు కెరియర్ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో రహస్య ప్రేమాయణం సాగించిన ఈమె ఇటీవల రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని రష్మిక అభిమానులతో పంచుకుంది. ఇకపోతే గత కొద్ది రోజులుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. దీనిపై కూడా రష్మిక స్పందించింది. సమయం, సందర్భం వచ్చినప్పుడు తానే చెబుతానని వెల్లడించింది. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది ఈ ముద్దుగుమ్మ తన వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా 2025 కెరియర్ పరంగా సూపర్ హిట్ అయితే 2026 ఈమెకు వ్యక్తిగతంగా సూపర్ హిట్ కాబోతోందనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి వచ్చే ఏడాది రష్మికకి ఏ విధంగా కలిసి వస్తుందో.
