బయోపిక్స్ లో అందాల తారలు!
వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకునే నటి శ్రద్ధా కపూర్ మరాఠీ జానపద కళారంగంలో సేవలు అందించిన ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్, లావణి నర్తకి విఠాబాయి నారాయణగాంకర్ పాత్రను పోషించేందుకు ఎంపికయ్యారు.
By: Srikanth Kontham | 14 Sept 2026 6:00 PM ISTబయోపిక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజ జీవిత గాథలను తెరపైకి తీసుకురావడం ఒక ఎత్తైతే? ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసిన మహోన్నత వ్యక్తుల పాత్రలను పోషించడం నటీనటులకు ఎంతో సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో అగ్రకథా నాయికలు సైతం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు పదును పెట్టే బయోపిక్ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు.
ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్న సంగీత ప్రపంచంలో పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో మహోన్నత శిఖరాలను అధిరోహించిన గానకోకిల ఎమ్మెస్. సబ్‌లక్ష్మి బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవు తున్నారు. శాస్త్రీయ సంగీత దిగ్గజమైన సుబ్బలక్ష్మి హావభావాలను, ప్రశాంత వదనంతో చేసే గానకచేరీ శైలిని తెరపై ప్రతిబింబించడం రష్మిక కెరీర్‌లోనే పెద్ద మైలురాయిగా మారనుంది. ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ కు రెడీ అవుతున్నారు.
అలాగే బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ భారతీయ సినీ చరిత్రలో ట్రాజెడీ క్వీన్ గా పేరుగాంచిన దిగ్గజ నటి మీనా కుమారి జీవిత కథలో నటించబోతున్నారు. 1950- 60ల కాలంలో భావోద్వేగమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మీనా కుమారి జీవితంలోని వైవిధ్యభరిత ఘట్టాలను, వ్యక్తిగత సంఘర్షణలను కియారా తెరపై ఏ విధంగా ఆవిష్కరిస్తారనేది సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకునే నటి శ్రద్ధా కపూర్ మరాఠీ జానపద కళారంగంలో సేవలు అందించిన ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్, లావణి నర్తకి విఠాబాయి నారాయణగాంకర్ పాత్రను పోషించేందుకు ఎంపికయ్యారు. జీవితాంతం రంగుల ప్రపంచమే శ్వాసగా బతికి రంగస్థలానికి నూతన శోభను తెచ్చిన విఠాబాయి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం శ్రద్ధా కపూర్ నటనా పటిమకు నిజమైన పరీక్ష అని చెప్పొచ్చు.
కమర్షియల్ సినిమాల్లో మెరిసే ఈ భామలు తమ నటనలోని పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇలాంటి చారిత్రాత్మక పాత్రలను ఎంచుకోవడం హర్షణీయం. కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా సమాజంలో చెరగని ముద్ర వేసిన మహిళా దిగ్గజాల కథలను ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ముందుకు రావడం వారి వృత్తిపరమైన పరిణితికి నిదర్శనం.
మొత్తానికి రష్మిక మందన్న, కియారా అద్వానీ, శ్రద్ధా కపూర్ లెక్కింపులన్నీ సరైన దిశలోనే వెళ్తున్నాయి. ఈ బయోపిక్‌ల ద్వారా భామలంతా తమ సినీ ప్రయాణంలో నూతన అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఈ భామలు చూపించబోయే నటన, సాధించే విజయాలు భారతీయ చిత్రసీమలో బయోపిక్‌ల ట్రెండ్‌ను మరిన్ని శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయం.
