బెజవాడ ఫ్యాన్స్ హృదయాలు గెలుచుకున్న హైదరాబాదీ కోడలు!
వేదికపై అభిమానులను ఉద్దేశించి రష్మిక మాట్లాడిన తీరు అక్కడి జనాలను విపరీతంగా కట్టిపడేసింది.
By: Sivaji Kontham | 18 Oct 2026 2:02 PM ISTవిజయవాడ వేదికగా జరిగిన `రణబాలి` చిత్ర విజయోత్సవ వేడుక టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ వేడుకకు విజయ్ తో పాటు చిత్ర కథానాయిక రష్మిక మందన్న హాజరుకావడం.. అందునా పెళ్లి తర్వాత వచ్చిన మొదటి దసరా పండుగను బెజవాడ అభిమానుల మధ్య జరుపుకోవడం ఆమెకు - ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో తన అరుదైన అభినయంతో పాటు.. అచ్చమైన తెలుగుదనంతో కూడిన హావభావాలతో అలరిస్తున్న ఈ `హైదరాబాదీ కోడలు` విజయవాడ గడ్డపై అడుగుపెట్టడంతోనే అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించారు.
వేదికపై అభిమానులను ఉద్దేశించి రష్మిక మాట్లాడిన తీరు అక్కడి జనాలను విపరీతంగా కట్టిపడేసింది. ``బెజవాడ అమ్మ వారు ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటారు.. కానీ ఇలాంటి వేడుకకు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.. పిల్లలను తీసుకు రావొద్దు .. ప్రమాదం!`` అంటూ ఆమె చెప్పిన క్యూట్ మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మధ్యమధ్యలో ముద్దుగా `ఏయ్` అని పిలుస్తూ అభిమానులలో జోష్ నింపిన తీరు చూస్తుంటే, ఆంధ్రుల హృదయాలను రాషి ఎంత త్వరగా సొంతం చేసుకున్నారో స్పష్టమైంది. రష్మిక ప్రసంగం ఆద్యంతం అప్యాయత తొణికిసలాడింది.
ఇక `రౌడీ బోయ్` విజయ్ దేవరకొండ కూడా తనదైన శైలిలో కూల్‌గా వ్యవహరిస్తూ ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. విజయవాడ సెంటిమెంట్ అయిన `రౌడీ` అనే పదాన్ని గట్టిగా పలికి అభిమానుల్లో ఉత్సాహం నింపిన దేవరకొండ.. వేడుక ఆద్యంతం ఎంతో ప్రశాంతంగా ఉంటూ తన సతీమణి రష్మికకు పూర్తి బాసటగా నిలిచారు. రష్మిక మాట్లాడుతున్న సమయంలో తన చెంతే ఉంటూ ఎంకరేజ్ చేసిన తీరు, ఈ జంట `రణబాలి` ప్రమోషన్స్‌ను ఎంత సంతోషంగా, ఉత్సాహంగా నిర్వహిస్తున్నారో కళ్లకు కట్టింది.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `రణబాలి` చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న విజయం గురించి చెబుతూ.. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి చూడదగ్గ అద్భుతమైన అనుభూతి అని రష్మిక కొనియాడారు. తెలుగు ప్రేక్షకులు తమపైనా.. ఈ చిత్రంపైనా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయ్-రష్మిక జంట తెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఒకరికొకరు అండగా నిలుస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు.
కేవలం సినిమాల పరంగానే కాకుండా... సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఈ జంట ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ తమ సొంత పట్టణ పరిసరాల్లోని పేద మెరిట్ విద్యార్థులకు భారీగా స్కాలర్షిప్లు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రా పల్లెల్లోని అంతగా చదువుకు నోచుకోని పేద విద్యార్థులకు కూడా ఈ `విరోష్` జంట సహాయసహకారాలు అందించి భవిష్యత్తుకు బాటలు వేయాలని విజయవాడ రణబాలి సక్సెస్ ఈవెంట్ సాక్షిగా అభిమానులు కోరుకుంటున్నారు.
