మైసా కోసం రష్మిక రిస్క్.. కాళ్లకు టేపింగ్ వేసుకుని మరీ!
కొచ్చి షెడ్యూల్‌లో భాగంగా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
By: Sravani Lakshmi Srungarapu | 14 May 2026 10:11 AM ISTస్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆమె నటిస్తున్న యాక్షన్ డ్రామా మైసాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఇటీవల కేరళలో జరిగిన కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిన రష్మిక, అక్కడి అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కొచ్చిలో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడవులు, జలపాతాలు, ఎత్తైన కొండలు, వర్షాలు మధ్య సాగిన ఈ షూటింగ్ తనకు ఒక ప్రత్యేకమైన అనుభవమని రష్మిక చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలంటే భయం ఉన్నప్పటికీ, ఆ భయాన్ని ఎదుర్కొంటూ యాక్షన్ సీన్ల కోసం స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నానని రష్మిక వెల్లడించారు.
కొచ్చి షెడ్యూల్‌లో భాగంగా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. అడవుల్లో ట్రెక్కింగ్, ఔట్‌డోర్ షూటింగ్స్, యాక్షన్ రిహార్సల్స్, నిరంతర వర్షాల మధ్య పరుగు పందెంలా సాగిన షూట్ తనకు చాలానే గుర్తుండిపోయే అనుభవాల్ని ఇచ్చిందని పేర్కొన్నారు. షూటింగ్ టైమ్‌లో మోకాళ్లు, కాళ్లకు టేపింగ్ వేసుకుని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నానని ఆమె తెలిపారు. అలాగే తనతో పని చేస్తున్న యూనిట్ సభ్యులకు జాగ్రత్తగా ఉండాలని పదేపదే చెప్పేదాన్నని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ కష్టాల మధ్య కొచ్చిలో బాగా ఫేమస్ అయిన పాళమ్ పూరీను మాత్రం బాగా ఆస్వాదించానని సరదాగా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. బాల్కనీలో నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న కొన్ని అందమైన ఫొటోలను కూడా ఆమె ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ ఫొటోలలో రష్మిక చాలా నేచురల్‌గా కనిపించడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక మైసా సినిమాకు సంబంధించి కేరళ షెడ్యూల్ ఎంతో కీలకమని సినీ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, యాక్షన్ సన్నివేశాలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ఈ సినిమా కోసం ఆమె గతంలో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ప్రత్యేక యాక్షన్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలిసింది. కేరళలో జరిగిన తాజా షెడ్యూల్‌లో హై ఆక్టేన్ స్టంట్స్ ను తెరకెక్కించినట్టు టాక్ వినిపిస్తోంది. షెడ్యూల్ పూర్తైన సందర్భంగా యూనిట్ సభ్యులతో కలిసి తీసుకున్న వీడియోను షేర్ చేసిన రష్మిక, ఇంత కష్టపడి పనిచేసిన నా టీమ్‌కు ధన్యవాదాలు.. త్వరలో మళ్లీ సెట్స్‌లో కలుద్దామంటూ ఎమోషనల్ గా స్పందించారు. మరోవైపు ఆమె లైనప్‌లో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న పీరియడ్ డ్రామా రణబాలి, అలాగే షాహిద్ కపూర్, కృతి సనన్‌తో కాక్‌టెయిల్ 2 వంటి ప్రాజెక్టులు కూడా ఉండటంతో రష్మిక ఫుల్ బిజీగా మారిపోయారు.
