డెబ్యూ బ్యూటీ రెమ్యూనరేషన్.. అదే నిజమైతే సమస్యలు తగ్గేదెలా?
కొత్త హీరోయిన్.. తొలి తెలుగు సినిమా.. కానీ పారితోషికం మాత్రం స్టార్ హీరోయిన్ల స్థాయిలో ఉంటే? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది.
By: M Prashanth | 1 July 2026 8:45 AM ISTకొత్త హీరోయిన్.. తొలి తెలుగు సినిమా.. కానీ పారితోషికం మాత్రం స్టార్ హీరోయిన్ల స్థాయిలో ఉంటే? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సినిమాల ప్రొడక్షన్ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. కొత్తగా పరిచయమవుతున్న హీరోయిన్ కు కూడా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఆ వార్త నిజమైతే నిర్మాతలు చెబుతున్న ఖర్చుల సమస్యలు ఎలా తగ్గుతాయన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
సినిమాల బడ్జెట్ పెరగడానికి హీరోలు, హీరోయిన్ల పారితోషికాలే ప్రధాన కారణమని గత కొంతకాలంగా నిర్మాతలు, సినీ పెద్దలు చెబుతున్నారు. రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పెద్దగా మార్పు కనిపించడం లేదు. స్టార్ హీరోలు భారీ పారితోషికాలతో కొత్త రికార్డులు సృష్టిస్తుండగా, ఇప్పుడు కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ల రెమ్యూనరేషన్ చర్చకు వస్తోంది.
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. ఆ సినిమాకు ఆర్ ఎక్స్ 100, మంగళవారం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాతోనే బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ తెలుగులో పరిచయం కానుంది.
రషా ఇప్పటికే హిందీలో ఆజాద్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తొలి తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమెపై ప్రత్యేక దృష్టి పడింది. సినిమా పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ లో ఆమె లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా, లోకల్ బ్యూటీని తీసుకుని ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. రషా తడానీ రెమ్యూనరేషన్ గురించే ప్రస్తుతం ఎక్కువ చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ప్రకారం, ఆమెకు ఏకంగా రూ.1 కోటి పారితోషికం ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా కొత్త హీరోయిన్ కు తొలి సినిమాకు రూ.50 లక్షల వరకు పారితోషికం ఇవ్వడం కనిపించే పరిస్థితి. అలాంటిది తొలి తెలుగు చిత్రానికే కోటి రూపాయలు ఇచ్చారనే వార్తలు రావడంతో చర్చ మొదలైంది.
ఆ ప్రచారంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వకుండా, ముంబై నుంచి వచ్చిన కొత్త హీరోయిన్ కు ఇంత భారీ పారితోషికం ఎందుకు ఇస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రవీనా టాండన్ కూతురు కావడం, బాలీవుడ్ బ్యాక్ డ్రాప్, మార్కెట్ పరంగా ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే నిర్మాతలు నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు మాత్రమే. రషా నిజంగా కోటి రూపాయలు తీసుకుందా? లేక రూమర్లేనా? అనేది క్లారిటీ లేదు. కానీ ఒకవేళ నిజమైతే.. సినిమాల నిర్మాణ ఖర్చులు తగ్గాలంటే పారితోషికాలు తగ్గించాలని చెబుతున్న నిర్మాతల వాదనకు ఇలాంటి పరిణామాలు ఎంతవరకు ఉపయోగపడతాయన్న ప్రశ్న మాత్రం తప్పకుండా ముందుకు వస్తోంది.
