Begin typing your search above and press return to search.

అప్పుడే హైదరాబాద్‌ని సొంత ఇల్లు అనేసిన రాషా తడాని: టాలీవుడ్‌పై ముద్దుగుమ్మ కన్ను!

టాలీవుడ్ సినిమాలపై తనకున్న అభిమానాన్ని చాటుతూ.. మహేష్ బాబు నటించిన `గుంటూరు కారం` చిత్రంలోని `కుర్చీ మడతపెట్టి` పాట తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని రాషా సరదాగా తెలిపారు.

By:  Sivaji Kontham   |   25 July 2026 12:13 AM IST
అప్పుడే హైదరాబాద్‌ని సొంత ఇల్లు అనేసిన రాషా తడాని: టాలీవుడ్‌పై ముద్దుగుమ్మ కన్ను!
X

బాలీవుడ్ అందాల‌ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని `శ్రీనివాస మంగపురం` చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. తొలి సినిమా విడుదలకు ముందే ఈ భామ హైదరాబాద్ నగరంతో.. టాలీవుడ్‌తో పెన‌వేసుకున్న అనుబంధాన్ని షేర్ చేస్తూ ఔరా! అనిపించింది. ఇండస్ట్రీలోకి రాకముందే తెలుగు సినిమాపైనా, ఇక్కడి వాతావరణంపైనా పూర్తి అవగాహన పెంచుకున్న రాషా.. హైదరాబాద్‌ను తన సొంత ఇల్లుగా వర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.

హైదరాబాద్‌పై తనకున్న ప్రేమాభిమానాల వెనుక తన తండ్రి, ప్రముఖ పంపిణీదారుడు (డిస్ట్రిబ్యూటర్) అనిల్ తడాని ప్రభావం ఎంతగానో ఉందని రాషా వెల్లడించారు. తన తండ్రి పనిమీద హైదరాబాద్‌కి బయలుదేరిన ప్రతిసారీ `నా సొంతూరికి వెళ్తున్నాను` అని చెబుతుంటారని.. ఆ రకంగా తమ కుటుంబానికి హైదరాబాద్ ఒక హోమ్‌టౌన్ లాంటిదని స్పష్టం చేశారు. తండ్రికి ఉన్న సినిమా పిచ్చి వల్లే తాను చిన్నతనం (బాహుబలి 2) నుంచే ప్రతి తెలుగు చిత్రాన్ని క్రమం తప్పకుండా చూస్తూ పెరిగానని... అలా టాలీవుడ్ తన రక్తంలోనే భాగమైపోయిందని ఆనందం వ్యక్తం చేసింది రాషా.

తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తమ కుటుంబానికి ఎంతో సన్నిహితుడని తెలిపారు. తను నటిస్తున్న సినిమాల టీజర్లు లేదా పాటలు విడుదలైనప్పుడల్లా ప్రభాస్ వాయిస్ నోట్స్ పంపుతూ... సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ ఎంతో ప్రోత్సహిస్తారని వెల్లడించారు. అలాగే తన తల్లి రవీనా టాండన్ గతంలో నందమూరి బాలకృష్ణతో కలిసి పద్మాలయా స్టూడియోస్‌లో షూటింగ్ చేసిన విషయాన్ని అక్కడివారు చెప్పినప్పుడు.. తన తొలి సినిమా ప్రయాణానికి అదొక పవిత్రమైన ఆశీర్వాదంగా అనిపించిందని ఎమోషనల్ అయ్యారు.

టాలీవుడ్ సినిమాలపై తనకున్న అభిమానాన్ని చాటుతూ.. మహేష్ బాబు నటించిన `గుంటూరు కారం` చిత్రంలోని `కుర్చీ మడతపెట్టి` పాట తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని రాషా సరదాగా తెలిపారు. తాను ఎప్పుడు ఫోటోషూట్‌లు చేసుకున్నా హోటల్ రూమ్‌లో ఆ పాటే ప్లే అవుతుంటుందని... మహేష్ బాబు- శ్రీలీల డాన్స్ ఎనర్జీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. ఇక తన తొలి చిత్రం `శ్రీనివాస మంగపురం`లో `మంగ` అనే అమాయకమైన, ఉత్సాహవంతురాలైన పాత్రలో నటిస్తున్నానని.. హీరో- హీరోయిన్ ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్న కథ కావడంతోనే ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు.

భాష కొత్తదైనా సెట్‌లో దర్శకుడు అజయ్, సహనటుడు జెకే ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారని... డైలాగులు అర్థం చేసుకోవడంలో ఎంతో సహాయపడ్డారని రాషా కొనియాడారు. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న `శ్రీనివాస మంగాపురం` చిత్రంపై రాషా కొండంత ఆశలు పెట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో టాలీవుడ్‌పై గట్టిగానే కన్నేసిన ఈ బొంబాయి భామ.. తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుని ఇక్కడ బిజీ హీరోయిన్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.